సూర్యాపేట: నెలలో 300 సార్లు భూప్రకంపనలు

25 Jul, 2020 14:05 IST|Sakshi

వరుస భూప్రకంపనలతో దద్దరిల్లుతున్న సూర్యాపేట జిల్లా

సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు చిన్న శబ్దం వినిపించినా జంకుతున్నారు. అందుకు కారణం తరుచూ ఇక్కడ భూకంపాలు రావడమే. ప్రతి రోజు కనీసం 20 సార్లు భూమి నుంచి భారీ శబ్దాలు వినిపించడం, దృఢంగా కట్టిన ఇళ్ళు సైతం బీటలు వారడం, ఇంట్లో సామాగ్రి పడిపోతుండడంతో ఇళ్ళ నుంచి ప్రజలు పరుగులు పెడుతున్నారు. ప్రధానంగా చింతలపాలెం మండలంలో గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వందల సార్లు స్వల్ప భూకంపాలు సంభవించాయి. అత్యధికంగా జనవరి 26న ఉదయం 3 గంటల సమయంలో రిక్టర్ స్కేల్ పై 4.6గా భూకంప తీవ్రత నమోదయ్యింది. రాష్ట్రంలోనే దాదాపు 51ఏళ్ల తర్వాత ఇంత పెద్ద భూకంపం సంభవించడం ఇదే తొలిసారని ఎన్జీఆర్‌ఐ రికార్డులు వెల్లడిస్తున్నాయి.

ఒక్క జనవరి నెలలోనే 300 సార్లు ప్రకంపనలు రాగా కొద్ది గ్యాప్ తర్వాత మళ్ళీ భూ ప్రకంపనలు మొదలు కావడంతో ప్రజలు ధైర్యం కోల్పోతున్నారు. ఈ నెల 9న మధ్యాహ్నం 1గంట సమయంలో పెద్ద శబ్దాలతో భూమి కంపించగా భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.1గా నమోదైంది. తరచూ వస్తున్న భూకంపాల తీవ్రతను అంచనా వేసేందుకు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు ప్రభుత్వ పాఠశాలలో, పాత వెల్లటూరులో ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో రెండు భూకంప తీవ్రత నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 100 కి.మీ వరకు భూప్రకంపన తరంగాలు వ్యాప్తిచెంది ఉంటాయని, భూ కంప గరిబనాభి ప్రాంతమైన వెల్లటూరు నుంచి సూర్యాపేట, నల్గొండ, కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో భూకంపం ప్రభావం ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. కృష్ణపట్టిలోని సున్నపురాయి, ఇసుక రాయి ప్రాంతాల్లోని భూమి లోతుల్లో ఈ స్థాయి భూకంపం ఇదే ప్రథమం కావడంతో శాస్త్రవేత్తలు మరింత అధ్యయనం చేస్తున్నారు.

ఈ భూకంప లేఖినిలతో ఎప్పటికప్పుడు భూకంప తీవ్రతను గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భూమి లోపల ఏడు కిలోమీటర్ల లోతులోని పొరల్లో పగుళ్లు ఏర్పడటం వల్ల పక్కనున్న రాతిపొరలను అధిగమించే క్రమంలో ఒత్తిడి, సర్దుబాటు కారణంగా ఈ భూకంపాలు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూపొరల లోపల రాపిడి, ఒత్తిడి వల్ల తరుచూ భూప్రకంపనలు సంభవిస్తాయని అంచనా వేశారు. రెవిన్యూ అధికారులు మాత్రం భూకంప తీవ్రతపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి భూకంపం సమయాల్లో ఇళ్ల నుంచి బయటకు రావడం వల్ల ప్రాణనష్టం జరుగకుండా నివారించవచ్చని చెబుతున్నారు. అయితే వారికి ఎలాంటి అవహగన కల్పించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. శాస్త్రవేత్తలు సాధారణ భూకంపాలని చెబుతున్నా ఆదిశగా ప్రజలకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు