ఆర్వోల నిర్ణయమే అంతిమం

18 Nov, 2023 04:18 IST|Sakshi

వారి నిర్ణయాలను పునఃసమీక్షించే అధికారం ఈసీకి కూడా ఉండదు 

20లోగా బ్యాలెట్‌ పత్రాల ముద్రణ పూర్తి.. 3 రోజుల పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ నిర్వహణ 

డిప్యూటీ సీఈఓ సత్యవాణి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నామినేషన్ల పరి శీలనలో రిటర్నింగ్ అధికారు (ఆర్వో)లు తీసుకున్న నిర్ణయాలే అంతిమమని, వాటిపై పునః సమీక్ష జరిపే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం లేదని రాష్ట్ర ఎన్నికల ఉప ప్రధాన అధికారి (డిప్యూటీ సీఈఓ) సత్యవాణి స్పష్టం చేశారు. కొందరు అభ్యర్థుల విషయంలో ఆర్వోల నిర్ణయాలపై వచ్చిన ఫిర్యాదులను తిరిగి వారికే పంపించినట్టు తెలిపారు.

ఆర్వోలకు క్వాజీ జ్యుడీషియల్‌ అధికారాలుంటాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను వివరించేందుకు శుక్రవారం ఆమె బీఆర్‌కేఆర్‌ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 18లోగా పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు, 20 లోగా ఈవీఎంల బ్యాలెట్‌ పత్రాల ముద్రణ పూర్తి చేస్తామన్నారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం 299 అనుబంధ పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు అనుమతినిచ్చిందని, దీంతో రాష్ట్రంలో మొత్తం పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 35,655కి పెరిగిందని చెప్పారు.

ప్రతి జిల్లాలో కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ఈసీకి ప్రతిపాదనలు పంపించామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్దే ఈవీఎంలను నిల్వ చేసే స్ట్రాంగ్‌ రూమ్స్‌ ఉంటాయని తెలిపారు. పోలింగ్‌లో వినియోగించిన ఈవీఎంలను కేటగిరీ–ఏ, పోలింగ్‌ సందర్భంగా మొరాయించిన ఈవీఎంలను కేటగిరీ–బీ కింద పరిగణించి ఒకే స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరుస్తామన్నారు. మాక్‌పోల్‌కి వాడిన ఈవీఎంలను కేటగిరీ–సీ, రిజర్వ్‌ ఈవీఎంలను కేటగిరీ–డీ కింద పరిగణించి వేర్వేరు స్ట్రాంగ్‌ రూమ్స్‌లో భద్రపరుస్తామని వివరించారు.  

3 రోజుల పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌        
వయోజన, దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించే తేదీలను స్థానిక రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారని సత్యవాణి తెలిపారు. మూడు రోజుల పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను నిర్వహిస్తారన్నారు. పోలింగ్‌ నవంబర్‌ 30న జరగనుండగా, దానికి 3 రోజుల ముందులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పాస్‌లు రావడంలో జాప్యం కావడంతో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కోసం జర్నలిస్టులు చేసుకున్న దరఖాస్తులను జిల్లాల కలెక్టర్లు తిరస్కరించిన అంశంపై పరిశీలన చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు