ఉద్యోగులకు పీఆర్‌సీ 30శాతం!

22 Mar, 2021 04:30 IST|Sakshi

నేడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించే అవకాశం 

ఎన్నికల కోడ్‌ అడ్డంకి కాదంటూ ఈసీ గ్రీన్‌సిగ్నల్‌ 

ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం సుదీర్ఘ భేటీ 

30% ఇస్తే ఖజానాపై రూ. 9 వేల కోట్ల భారం

32% వరకూ ఉండొచ్చన్న అధికార వర్గాలు

33% ఇస్తారన్న ఆశలో ఉద్యోగులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లంతా ఎదురుచూస్తున్న వేతన సవరణ (పీఆర్సీ) ప్రకటనకు రంగం సిద్ధమైంది. రెండు మూడు రోజుల్లో అసెంబ్లీ వేదికగా పీఆర్సీ, రిటైర్మెంట్‌ వయసు పెంపుపై ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్‌ ఈనెల 17న శాసనసభలో చెప్పిన విషయం తెలిసిందే. దీనికి ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సోమవారం శాసనసభలో 30 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

32 శాతం వరకు కూడా ఇచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. మరోవైపు ఉద్యోగ సంఘాలు 33 శాతం వరకు ఫిట్‌మెంట్‌ ఇస్తారన్న ఆశాభావంతో ఉన్నాయి. ప్రతి ఒక్క శాతం ఫిట్‌మెంట్‌కు ఏటా రూ.300 కోట్లు ఖజానాపై భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా. ఈ లెక్కన 30 శాతం ఇస్తే రూ.9వేల కోట్లు ఖర్చు పెరుగుతుంది. అదే 32 శాతం ఇస్తే రూ.9,600 కోట్లు, 33 శాతమిస్తే రూ.9,900 కోట్లు అదనంగా వెచ్చించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం భేటీ 
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కనీసం 29శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ, రిటైర్‌మెంట్‌ వయసు 61 ఏళ్లకు పెంపు, సీపీఎస్‌ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్‌ పీరియడ్‌ రెండేళ్లకు కుదింపు వంటి అంశాలపై సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇటీవల సీఎం కేసీఆర్‌ కూడా పీఆర్‌సీ, పదవీ విరమణ వయసు పెంపు వంటి అంశాలపై రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తానని శాసనసభలో వెల్లడించారు. ప్రస్తుతం రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిచిన నేపథ్యంలో.. సీఎం కేసీఆర్‌ ఆదివారం ఉద్యోగ సంఘాల నేతలను ప్రగతిభవన్‌కు పిలిపించుకున్నారు. ఉద్యోగ నేతలు, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి భోజనం చేశారు. తర్వాత భేటీ అయ్యారు. రాత్రి 11 గంటల వరకు జరిగిన ఈ భేటీలో పీఆర్సీ ఫిట్‌మెంట్, ఇతర అంశాలపై చర్చించినట్టు తెలిసింది. 

సంతృప్తికరంగా ఫిట్‌మెంట్‌ 
ఉద్యోగులకు సంతృప్తి కలిగేలా ఫిట్‌మెంట్‌ ప్రకటిస్తామని భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పేర్కొన్నట్టు తెలిసింది. అయితే 30 శాతం వరకు పీఆర్సీ ఇచ్చే అవకాశం ఉందని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన సంతృప్తితో ఉన్న నేపథ్యంలో 32 శాతం వరకు ప్రకటించవచ్చని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అయితే 34శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ, పదవీ విరమణ వయసు 60ఏళ్లకు పెంపుపై కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. సోమవారం ఈ అంశాలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. సీపీఎస్‌ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్‌ వంటి ఇతర అంశాలపైనా ప్రకటన రావొచ్చని సమాచారం. 

పీఆర్సీకి ఈసీ గ్రీన్‌సిగ్నల్‌ 
ఎన్నికల ప్రవర్తనా నియమావళి రీత్యా రాష్ట్రంలో పీఆర్సీ సిఫార్సుల ప్రకటనకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. అయితే నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగుతున్న నల్గొండ జిల్లా పరిధిలో ఈ అంశాన్ని ఎవరూ రాజకీయ లబ్ధి కోసం, ప్రచారం కల్పించుకోవడానికి వాడుకోరాదని షరతు విధించింది.

2017 జూన్‌ 29న జారీ చేసిన ఉప ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని సూచించింది. సాగర్‌ ఉప ఎన్నిక కారణంగా నల్లగొండ జిల్లాలో కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో.. పీఆర్సీ ప్రకటనకు అనుమతివ్వాలంటూ రాష్ట్ర ఆర్ధిక శాఖ శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)కి లేఖ రాసింది. సీఈవో ఆఫీసు ఈ లేఖను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది. దీంతో పీఆర్సీపై ప్రకటన చేసేందుకు అభ్యంతరం లేదంటూ కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాష్‌ కుమార్‌ ఆదివారం బదులిచ్చారు. 

పాఠశాలల కొనసాగింపుపైనా.. 
రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు సంబంధించి కూడా సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఫిజికల్‌ క్లాసులు జరుగుతున్నాయి. ఇందులో 8వ తరగతి వరకు నిలిపివేసే అవకాశం ఉంది. ఇక 9వ తరగతి విద్యార్థులకు కూడా ప్రత్యక్ష బోధనను నిలిపివేసి, ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా ప్రమోట్‌ చేసే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు