వైల్డ్‌ లైఫ్‌ టూరిజం పునః ప్రారంభం

20 Jan, 2023 02:07 IST|Sakshi

ఫ్లాగ్‌ఆఫ్‌తో టైగర్‌ సఫారీ... 

‘ఆన్‌లైన్‌లో’ టైగర్‌ స్టే ప్యాకేజీని ప్రారంభించనున్న మంత్రి ఇంద్రకరణ్‌

సాక్షి, హైదరాబాద్‌: అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌) పరిధిలో ‘ఎకోఫ్రెండ్లీ వైల్డ్‌ లైఫ్‌ టూరిజం’ తిరిగి ప్రారంభం కానుంది. 2021 నవంబర్‌లో ప్రయోగాత్మకంగా మొదలైన ‘వైల్డ్‌లైఫ్‌ టూరిజం ప్యాకేజీ టూర్‌’ని జతచేసిన సరికొత్త హంగులు, ఆకర్షణలతో  శుక్రవారం అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి  పునఃప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా టైగర్‌ సఫారీ కోసం సమకూర్చిన కొత్తవాహనాలను ఫ్లాగ్‌ఆఫ్‌ చేయడం ద్వారా ఈ కార్యక్రమం మొదలుకానుంది.

టూర్‌లో భాగంగా ‘టైగర్‌స్టే ప్యాకేజీ’ని ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్‌తో మంత్రి ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. పర్యాటకులకు కొత్తగా అందుబాటులోకి తీసుకురానున్న ఆరు కాటేజీలను కూడా మంత్రి ప్రారంభిస్తారు. ఏటీఆర్‌ పరిధిలో పులుల కదలికల ఫొటోలు, పాదముద్రలు, ఇతర అంశాలతో తయారుచేసిన ‘ఏటీఆర్‌ టైగర్‌బుక్‌’ను  ఆవిష్కరిస్తారు. అటవీ, వన్య­ప్రాణుల పరిరక్షణకు కృషి చేస్తున్న ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఏటీఆర్‌క్లబ్‌’ సభ్యులతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమావేశం నిర్వహిస్తారు.

 ‘టైగర్‌స్టే ప్యాకేజీ’ ఇలా...
టూరిజం ప్యాకేజీలో... టైగర్‌ సఫారీ, ట్రెక్కింగ్, ఫారెస్ట్‌ స్టడీటూర్, ఆదివాసీ, గిరిపుత్రులను కలుసుకుని వారి జీవనశైలి, అనుభవాలు తెలుసుకోవడం వంటివి జతచేశారు. దాదాపు 24 గంటల పాటు ఇక్కడ గడపడంతో పాటు రాత్రి పూట అడవిలోనే కాటేజీలు, మట్టి ఇళ్లలో బస వంటివి అందుబాటులోకి తేనున్నారు.  స్థానికంగా ఉండే చెంచులు, ఆదివాసీలే టూరిస్ట్‌ గైడ్‌లుగా వ్యవహరించనున్నారు. రాత్రిపూట అడవిలోని పర్‌క్యులేషన్‌ ట్యాంక్‌లో నీటిని తాగడానికి వచ్చే వన్యప్రాణుల వీక్షణకు నైట్‌విజన్‌ బైనాక్యులర్స్‌ ఏర్పాటు చేశారు. ఎకోఫ్రెండ్లీ చర్యల్లో భాగంగా... జ్యూట్‌బ్యాగ్‌ వర్క్‌షాపు, ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌సెంటర్, బయో ల్యాబ్‌ల సందర్శన ఉంటుంది.  

మరిన్ని వార్తలు