హైదరాబాద్‌లో పెరుగుతున్న ఎకో వెడ్డింగ్‌ కల్చర్‌..

11 Dec, 2022 15:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెళ్లంటే ఇద్దరు కలిసి జీవితం గడపడం అంతే తప్ప కన్నవాళ్లని కష్టాల్లోకి నెట్టడం కాదు...పెళ్లంటే ఇద్దరు భవిష్యత్తును అందంగా ఊహించుకోవం ఒక్కటే కాదు భావితరాలకు మంచి సందేశం ఇవ్వడం కూడా.. అనుకున్నారు నగర యువతి స్ఫూర్తి కొలిపాక.  అందుకే తన పెళ్లిని అంగరంగ వైభవంగా కాక ఆదర్శవంతంగా మార్చారు.  

పర్యావరణ ప్రేమికురాలైన స్ఫూర్తికి ఇటీవలే కేన్సర్‌ బయాలజీలో పీహెచ్‌డీ చేసిన ప్రశాంత్‌తో వివాహం జరిగింది  ఆర్థికంగా మంచి పరిస్థితిలో ఉన్నా...  పూర్తిగా లో బడ్జెట్‌లో అది కూడా పర్యావరణ హితంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది..ఈ రకమైన పెళ్లి కోసం  తన తల్లిదండ్రులను  బంధువులు/స్నేహితులను సిద్ధం చేయడానికి తనకు కనీసం సంవత్సరం పట్టిందని అంటున్నారు.  ఆమె పంచుకున్న తన ఎకో–వెడ్డింగ్‌ విశేషాలు... 

► అతిథులకు వాట్సాప్‌ లేదా వీడియో కాల్‌ల ద్వారా మాత్రమే ఈ–ఆహ్వానాలను పంపించారు.  

►పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలన్నీ ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నారు. దీని కోసం సాంప్రదాయ పందిరిని ఎంచుకున్నారు  స్థానిక టెంట్‌ హౌస్‌ నుంచి కొన్ని అదనపు కుర్చీలను మాత్రం అద్దెకు తీసుకున్నారు. ఇంటి లోపల అదనపు అలంకరణ ఏమీ చేయలేదు. ఇంటి నిండా మొక్కలు, వినోదం, నవ్వు  సంగీతం తప్ప. 

►పెళ్లి షామీర్‌పేట్‌లోని ఓ గ్రీన్‌ ఫామ్స్‌లో జరిగింది – గదులు/ ఓపెన్‌–ఎయిర్‌ లాన్‌లు/ డైనింగ్‌ స్పేస్‌/ పిల్లల కోసం ప్లే ఏరియాతో కూడిన అందమైన 5 ఎకరాల ఫామ్‌ హౌస్‌ –24 గంటలకు కేవలం 55,000/మాత్రమే చెల్లించినట్లు స్ఫూర్తి చెప్పారు.   

►ఉదయం పెళ్లి అయినందున, విద్యుత్‌ తోరణాలు, లైటింగ్‌/ఏసీ తదితర అనవసరమైన వినియోగాన్ని పూర్తిగా తగ్గించారు.  ఉదయపు వెలుతురు ఆహ్లాదకరమైన గాలి బాగా వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు.  

►పెళ్లి మండపాన్ని స్థానికంగా లభించే పూలతో పూర్తిగా అలంకరించారు. అలాగే  సహజంగా పెరిగిన చెట్లను నేపథ్యంగా ఉపయోగించారు! 

►అతిథుల కోసం వేదికను సూచించడానికి దారి పొడవునా  ఫ్లెక్సీ బ్యానర్‌లను  చేయకుండా  కాన్వాస్‌ను ఉపయోగించారు. 

►ఎంతో కాలంగా ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను ఉపయోగించని ఆమె తన పెళ్లికి జీరో–ప్లాస్టిక్‌ బాటిల్‌ పాలసీని అమలు చేశారు.  వివాహ ఆహ్వానంలోనే అతిథులు తమ సొంత వాటర్‌ బాటిల్‌ను తెచ్చుకోవాలని  కోరారు. అలాగే ప్లాస్టిక్‌తో చుట్టబడిన బహుమతులు వద్దని తదితర పర్యావరణ హితమైన సూచచనలతో ప్రత్యేకంగా  ఓ పేజీ జతచేశారు. 

►విందులోకి పూర్తిగా సహజమైన కాయగూరలు, ఆకుకూరలతో పూర్తి  సాంప్రదాయ తెలుగు భోజనాన్ని ఎంచుకున్నారు అది కూడా పచ్చని అరటి ఆకులపై మాత్రమే వడ్డించారు.  

వ్యయాన్ని తగ్గించారిలా... 
►వధువు, వరుని కుటుంబాలు ఇచ్చి పుచ్చుకునే కట్నకానుకల్ని పూర్తిగా రద్దు చేసుకున్నారు. కన్యాదాన్‌ అప్పగింతలు ఆచారాలు అలాగే మహిళలకు ప్రత్యేకమైన వివాహ గుర్తులను వద్దని నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి కోసం కొన్ని సాంప్రదాయ చేనేత వస్త్రాలను మాత్రమే ఎంచుకున్నారు. ఆమె  పెళ్లి చీర అదీ చేనేత స్టాల్‌లో కేవలం 1,000/ మాత్రమే వెచ్చించి కొనుగోలు చేశారు. 

►అభివృద్ధి చెందుతున్న ఎకోఫెమినిస్ట్‌గా, అన్ని రకాల కట్నాలు/ కట్నాలను వ్యతిరేకించాలని స్ఫూర్తి యువతను కోరుతున్నారు. చాలామంది వధువు కుటుంబం వరుడికి ఇచ్చే కట్నం గురించి మాత్రమే మాట్లాడతారు, కానీ వరుడి సోదరీమణులకు బహుమతులు, ఆడపడుచు కట్నం, సమీప బంధువులు వారి పిల్లలకు బట్టలు, బట్టల కట్నాలు, రిటర్న్‌ బహుమతులు, మొదలైనవి  ఇవన్నీ వధువు కుటుంబాల ఆర్థిక భారాన్ని పెంచేవేనని  ఇవి మానేస్తే  వ్యయాన్ని తగ్గిస్తాయి.

► అంతేకాదు పర్యావరణానికి మేలు చేస్తాయనీ అంటున్నారామె.  నగరంలో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, సోషల్‌ వర్క్‌ కోసం పలు రాష్ట్రాల్లో  పర్యటించిన సందర్భంగా తన అనుభవాలే తనను పర్యావరణ ప్రియురాలిగా మార్చాయని, సామాజిక మాధ్యమాలతో పాటు వీలున్నన్ని మార్గాల ద్వారా తన వంతు కృషి చేస్తానని అంటున్నారు.

మరిన్ని వార్తలు