సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై పర్యావరణ వేత్తల ఆందోళన.. అసలేంటి జీవో 111?

16 Mar, 2022 08:42 IST|Sakshi

నగర వాతావరణంలో పెనుమార్పులు

జీవో 111 ఎత్తివేత నిర్ణయంపై పర్యావరణ వేత్తల ఆందోళన

నగర జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్య ప్రాంతమంతా ఈ జలాశయాల పరిధిలోనే.. 

సాక్షి, హైదరాబాద్‌: జీవో 111 ఎత్తివేస్తామంటూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై పర్యావరణ వేత్తలు, నీటి వనరుల రంగ నిపుణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌ మహానగరానికి అత్యంత సమీపాన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాలు ఉన్నాయని, నగరంతో ముడిపడిన జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్య ప్రాంతం మొత్తం కూడా ఈ జలాశయాల పరిధిలోనే ఉందని వారు చెబుతున్నారు. ఈ ప్రకృతి సహజసిద్ధమైన లక్షణం, నగరానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న పరిస్థితులు దెబ్బతింటే.. ప్రస్తుత గ్లోబల్‌ వార్మింగ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ నగర వాతావరణంలో పెను మార్పులు సంభవించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. 

జలాశయాల ప్రాధాన్యత తగ్గించకూడదు 
‘దేశంలో, బహుశా ప్రపంచంలో కరెంట్‌ లేకుండా నీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ మాత్రమే. అంటే సున్నా శాతం కర్బన ఉద్ఘారాలతో నీటిని సరఫరా చేసే ఇంతగొప్ప జలాశయాలను గొప్పగా చూపుకోవాలి. అంతేకానీ వాటి ప్రాధాన్యతను, విలువను తగ్గించకూడదు. 1908లో హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తినప్పుడు వాటి నివారణకు నీటిపారుదల రంగ నిపుణుడు, రాజనీతిజ్ఞుడు మోక్షగుండం విశ్వశ్వేరయ్య విభిన్న ఆలోచనలతో ముందుచూపుతో వీటికి డిజైన్‌ చేశారు..’అని సమీకృత నీటివనరుల నిర్వహణ నిపుణుడు, భారత ప్రమాణాల సంస్థ సాంకేతిక సభ్యుడు బీవీ సుబ్బారావు తెలిపారు.
చదవండి: CM KCR: అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ వరాల వర్షం


బీవీ సుబ్బారావు, పురుషోత్తంరెడ్డి

ప్రస్తుతం పరిమితులు లేని పట్టణీకరణ పెనుసమస్యగా మారిందని, పట్టణీకరణలో కూడా సుస్థిరమైన నీటిసరఫరా అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఈ వ్యవస్థను ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది ముఖ్యమని చెప్పారు. అభివృద్ధి అంటే కాంక్రీట్‌ బిల్డింగ్‌లు కట్టి అమ్మేయడం కాదన్నారు. హుస్సేన్‌సాగర్‌ విషయంలో జరిగిన తప్పు మళ్లీ జంట జలాశయాల విషయంలో జరగకుండా చూసుకోవాలని సూచించారు. వాటి అవసరం తీరిపోయిందన్నట్టుగా మాట్లాడటం సరికాదన్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో అన్ని అంశాలను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటే మంచిదని సూచించారు.  

కోర్టుల ముందు నిలబడలేదు 
‘భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మూసీనదిపై ఈ రెండింటినీ నిర్మించారు. జీవో 111ను సుప్రీంకోర్టు గతంలో పూర్తిగా సమర్థించింది. భవిష్యత్‌ తరాలను దృష్టిలో పెట్టుకుని వాతావరణ సమతుల్యాన్ని పాటిస్తూ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అందువల్ల జీవో 111ను ఏమీ చేయలేరు. తమకు అధికారం ఉందని ఏదైనా చేసినా కోర్టుల ఎదుట ఎంతమాత్రం నిలబడదు. రియల్‌ ఎస్టేట్‌ లాబీకి, కార్పొరేట్‌ ఒత్తిళ్లకు ప్రభుత్వం లొంగితే ప్రజలు ఈ ప్రతిష్టాత్మక అంశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు..’అని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ కె.పురుషోత్తంరెడ్డి హెచ్చరించారు. పర్యావరణాన్ని, భవిష్యత్‌ తరాల ప్రయోజనాలను పణంగా పెట్టడం సరికాదని అన్నారు.   

అసలేంటి జీవో 111
హైదరాబాద్‌ నగరానికి వరద ముప్పు తప్పించడంతోపాటు తాగునీటిని అందించేందుకు నిజాం కాలంలో ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాలను నిర్మించారు. హైదరాబాద్ మహా నగరానికి ఎన్నో ఏళ్లుగా తాగునీటి అవసరాలను తీర్చుతున్నాయి.  గతంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌ సాగర్‌ నుంచి నగరానికి నీళ్లు తీసుకునేవారు. ఇప్పుడది తగ్గిపోయింది. ఎండా కాలంలో సంక్షోభం వచ్చినప్పుడు నీళ్లు తీసుకునే సందర్భం ఉంది. హైదరాబాద్‌ నగరానికి ఇప్పుడు ఈ రెండు జలాశయాల నీళ్లు వాడుకోవాల్సిన అవసరం లేదు. సుమారు 1,32,600 ఎకరాల భూమి జీవో పరిధిలో ఉంది. 83 గ్రామాలు, ఏడు మండలాలు కలిసి ఉన్నాయి. ఈ రిజర్వాయర్‌ల పరిరక్షణకు జీవో 111 అమల్లో ఉంది.

అయితే రిజర్వాయర్ల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ.. 1994లో తొలుత జీవో నం. 192ను తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111ను తెచ్చింది. ఈ రెండు జలాశయాల పరిరక్షణ కోసం పలు వాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నారు.

ఇవీ నిబంధనలు 
జీఓ పరిధిలో మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి, షాబాద్, రాజేంద్రనగర్, కొత్తూరు మండలాల్లోని 83 గ్రామాలను చేర్చింది. ఈ జీవో పరిధిలో కాలుష్యకారకమైన ఫ్యాక్టరీలు, నిర్మాణాలు, లేఅవుట్లు, వెంచర్లు చేపట్టవద్దని నిబంధనలు పెట్టింది. వ్యవసాయం తప్ప ఏ రంగానికి ఇక్కడ భూమి కేటాయింపు చేయకూడదు. క్యాచ్మెంట్ పరిధిలో వేసే లే అవుట్లలో 60శాతం ఓపెన్ స్థలాలు, రోడ్లకు వదలాలి. అక్కడ వినియోగించే భూమిలో 90శాతం కన్జర్వేషన్ కోసం కేటాయించాలి. జలాశయాల్లో రసాయనాలు, క్రిమిసంహారకాల స్థాయిలు లెక్కించేందుకు ప్రత్యేక ఏజెన్సీతో పర్యవేక్షించాలి. జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో జీ+2కి మించి నిర్మాణాలు చేసేందుకు వీల్లేదు.

మరిన్ని వార్తలు