‘లిక్కర్‌’ స్కాంలో ప్రముఖులు

1 Dec, 2022 03:12 IST|Sakshi

అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్టులో ఈడీ

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారి పేర్లను ఈడీ ప్రస్తావించింది. బుధవారం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా సహచరుడు అమిత్‌ అరోరాను రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తూ రిమాండ్‌ రిపోర్టును ధర్మాసనానికి అందజేసింది. ఈ రిపోర్టు ద్వారా తొలిసారిగా ఎమ్మెల్సీ కె.కవిత పేరు బయటకొచ్చింది. దక్షిణాది గ్రూప్‌ నుంచి విజయ్‌నాయర్‌కు రూ.100 కోట్లు లంచాలు అందాయని వెల్లడించింది. ఎక్సైజ్‌ అధికారులకు రూ.కోటి లంచం అందించడంలోనూ విజయ్‌నాయర్‌ కీలక పాత్ర పోషించారని పేర్కొంది.

దక్షిణాది గ్రూపును శరత్‌చంద్రారెడ్డి, కె.కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి నియంత్రించారని పేర్కొంది. మద్యం పాలసీ రూపకల్పన సమయం నుంచి వీరంతా ఎన్ని ఫోన్లు వినియోగించారు. ఎన్ని ఫోన్‌ నంబర్లు మార్చారన్న అంశాలను తేదీలతో సహా వివరించింది.

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా నాలుగు ఫోన్‌ నంబర్లు, విజయ్‌నాయర్‌ రెండు, సృజన్‌రెడ్డి ఒకటి, అభిషేక్‌ బోయినపల్లి ఒకటి, బుచ్చిబాబు గోరంట్ల ఒకటి, శరత్‌రెడ్డి ఒకటి, కల్వకుంట్ల కవిత రెండు ఫోన్‌ నంబర్లు వినియోగించారని, ఏయే రోజుల్లో సదరు ఫోన్‌ వినియోగించారనేది ఐఎంఈఐ నంబర్‌ సహా స్పష్టం చేసింది.

మొత్తంగా 36 మంది (నిందితులు/అనుమానితులు) ఫోన్‌ నంబర్ల వివరాలను రిపోర్టులో పేర్కొంది. ఈ 36 మంది 170 ఫోన్లు వినియోగించి వాటిని ధ్వంసం చేశారని తెలిపింది. ఈ ఫోన్ల విలువ రూ.1.38 కోట్లు ఉంటుందని పేర్కొంది. 2022, సెప్టెంబర్‌ 23 వరకూ ఆయా ఫోన్లు వినియోగించారని తెలిపింది.

మద్యం విధానంలో భాగంగా 32 జోన్లుగా విభజించారని, ఆయా జోన్లను ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించారన్న విషయాలు వివరించింది. మద్యం పాలసీ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.2,873 కోట్లు నష్టం వాటిల్లిందని దీనిపై పూర్తిస్థాయి వివరాలు రాబట్టడానికి అమిత్‌ అరోరాను 14 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది.    

మరిన్ని వార్తలు