లిక్కర్‌ స్కాం కేసులో ట్విస్ట్‌: కవితకు మళ్లీ ఈడీ నోటీసులు

16 Mar, 2023 14:35 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: లిక్కర్‌ స్కాం కేసులో ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత నేడు(గురువారం) రెండోసారి విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. వెళ్లలేదు. దీంతో, ఈడీ కవితకు మళ్లీ నోటీసులు పంపించింది. 

తాజాగా నోటీసుల్లో ఈనెల 20వ తేదీన కవిత విచారణకు హాజరు కావాలని పేర్కొంది. దీంతో, ఈడీ నోటీసులపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఈనెల 24వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరగనున్న విషయం తెలిసిందే.

మరోవైపు, లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ అధికారులు రామచంద్ర పిళ్లైను రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు.. పిళ్లైకి మూడు రోజుల పాటు కస్టడీని పొడగించింది. అయితే, పిళ్లైని ఎమ్మెల్సీ కవితతోపాటు విచారించాల్సి ఉందని ఈడీ పేర్కొంది. ఈ కేసులో గురువారం కవిత విచారణకు హాజరు కానందున పిళ్లై కస్టడీని పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. దీంతో, ఈడీకి కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ సందర్బంగా లిక్కర్‌ స్కాం కేసులో కవిత అనుమానునితురాలే అని ఈడీ.. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. 

అంతకుముందు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గురువారం ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సిన ఎమ్మెల్సీ కవిత ట్విస్ట్ ఇచ్చారు. తాను విచారణకు హాజరుకాలేనని ఈడీ అధికారులకు తెలిపారు. తన న్యాయవాది ద్వారా సమాచారం పంపారు. ఈడీ విచారణపై స్టే ఇవ్వాలని తాను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని కవిత పేర్కొన్నారు. ఈమేరకు ఆమె ఈడీకి 6 పేజీల లేఖ రాశారు.

'కోర్టు తీర్పు వచ్చే వరకు కేసులో ఎలాంటి విచారణ సరికాదు. ఈ పరిస్థితుల్లో సుప్రీం ఆదేశాలు ఇచ్చే వరకు విచారణ వాయిదా వేయండి. మహిళను ఈడీ ఆఫీస్‌కి విచారణకు పిలవచ్చా అనే అంశం కూడా కోర్టులో పెండింగ్‌లో ఉంది. చట్ట సభ ప్రతినిధిగా చట్టాలు చేసే నాకు చట్ట విరుద్ధంగా జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి నా ముందు ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటాను. నా ప్రతినిధి సోమా భరత్ ద్వారా నా బ్యాంక్ స్టేట్మెంట్ సహా మీరు అడిగిన పత్రాలు పంపుతున్నాను.' అని ఈడీకి రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ‘కవితను ఇబ్బంది పెడుతున్నారు..ఈడీ రాత్రి వేళ ప్రశ్నించడమేంటి?’

మరిన్ని వార్తలు