డ్రగ్స్‌ కేసులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డికి నోటీసులు

16 Dec, 2022 13:26 IST|Sakshi

పీఎంఎల్‌ఏలోని మూడు సెక్షన్ల కింద జారీ

సోమవారం తమ ఎదుట హాజరుకావాలని ఆదేశం

ఏ కేసుకు సంబంధించో స్పష్టం చేయని ఈడీ

డ్రగ్స్‌ కేసులో సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు సైతం

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్‌ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్‌ఏ) 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను పొందుపరిచింది.

హైదరాబాద్‌ జోనల్‌ ఈడీ కార్యాలయం అదనపు డైరెక్టర్‌ దేవేందర్‌ కుమార్‌ సింగ్‌ పేరుతో, 15వ తేదీతో (గురువారం) ఈ సమన్లు ఉన్నాయి. 2015 నుంచి రోహిత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులకు సంబంధించిన ఆర్థిక, వ్యాపార లావాదేవీలు, ఐటీ, జీఎస్టీ రిటర్న్స్, బ్యాంకు స్టేట్‌మెంట్స్, స్థిరచరాస్తులతోపాటు రుణాల వివరాలు తీసుకురావాలంటూ ఈడీ స్పష్టం చేసింది. ఆధార్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు కాపీలు తీసుకురావాలని పేర్కొంది. అతడి కుటుంబీకులకు సంబంధించిన పూర్తి బయోడేటాను అందించాలని కోరిన ఈడీ దాని నమూనాను నోటీసులతో జత చేసింది. 

రోహిత్‌రెడ్డిపై తొమ్మిది కేసులు 
రోహిత్‌ రెడ్డి 2018లో నామినేషన్‌తోపాటు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం ఆయనపై మొత్తం 9 కేసులు ఉన్నాయి. ఇవన్నీ 2017–18 మధ్య తాండూరుతోపాటు బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో నమోదయ్యాయి. వీటిలో అత్యధికం ఎన్నికల సంబంధిత నేరాలే. ఒక్క కేసులో మాత్రమే మోసం తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ ఏడాది మార్చిలో బెంగళూరులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ కేసులోనూ రోహిత్‌రెడ్డి పేరు వినిపించింది. నిర్మాత శంకరగౌడ్‌ బెంగళూరులో గతేడాది ఇచ్చిన పార్టీకి రోహిత్‌రెడ్డి హాజరైనట్లు ఆరోపణలు ఉన్నాయి.

నైజీరియన్‌ అరెస్టుతో గుట్టురట్టయిన ఈ వ్యవహారంలో రూ.కోట్ల విలువైన డ్రగ్స్‌ విదేశాల నుంచి వచ్చినట్లు అక్కడి నార్కోటిక్‌ అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబం«ధించి ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తలకు నోటీసులు ఇచ్చిన బెంగళూరు పోలీసులు విచారించారు. వీరిలో కొందరు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులను ఆ పార్టీకి తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమేయంపై వార్తలు వెలువడ్డాయి. ఆ డ్రగ్స్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని రోహిత్‌రెడ్డి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏ కేసులో ఈడీ సమన్లు జారీ చేసిందో తెలియాల్సి ఉంది. ఏ కేసు ప్రస్తావన లేకుండా ఈడీ ఇచ్చిన నోటీసులపై రోహిత్‌రెడ్డి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. 

ఈడీ ఎలాంటి కేసులను దర్యాప్తు చేస్తుంది? 
ఈడీ అధికారులు రెండు చట్టాలకు సంబంధించిన కేసులను మాత్రమే దర్యాప్తు చేస్తుంటారు. పీఎంఎల్‌ఏతో పాటు విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద మాత్రమే కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటుంది. ఫెమా చట్టాన్ని ఈడీ అధికారులే నేరుగా వినియోగించవచ్చు. విదేశీ మారకద్రవ్యాలకు సంబంధించిన లావాదేవీలున్న అంశాలనే ఈ చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు చేస్తుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, విచారణకు నోటీసులు అందుకున్న వారు ఏదో ఒక కోణంలో విదేశీ కరెన్సీ లావాదేవీలు చేసి ఉండాలి. అయితే పీఎంఎల్‌ఏ కింద ఈడీ అధికారులు ఓ కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలంటే మాత్రం నేరుగా కుదరదు.

అప్పటికే ఏదో ఒక పోలీసుస్టేషన్‌ లేదా సీబీఐ వంటి ప్రత్యేక విభాగంలో కేసు నమోదై ఉండాలి. ఆ ఎఫ్‌ఐఆర్‌ ఆ«ధారంగానే ఈడీ పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేస్తుంది. ఏదైనా కేసులో ఓ వ్యక్తి నిందితుడు కాకపోయినప్పటికీ... నిందితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి విచారణలో పేరు వెలుగులోకి రావడమో, వారి వాంగ్మూలాల్లో ప్రస్తావన ఉండటమో జరిగినా ఈడీ నోటీసులు ఇచ్చి విచారించే ఆస్కారం ఉంది. ఇప్పటికే ఏదో ఒకచోట నమోదైన కేసు ఆధారంగానే రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసి ఉండొచ్చని చెప్తున్నారు.  

మరోసారి రకుల్‌కు నోటీసులు
టాలీవుడ్‌ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఈడీ అధికారులు శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈమెను సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. టాలీవుడ్‌ ప్రముఖులతో ముడిపడి ఉన్న డ్రగ్స్‌ కేసుకు సంబం«ధించి ఇప్పటికే ఈడీ రకుల్‌ను ఓసారి విచారించింది. ఎక్సైజ్‌ అధికారులు 2017లో నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. అయితే అప్పట్లో ఎక్కడా రకుల్‌ పేరు బయటకు రాలేదు. తర్వాత ఎక్సైజ్‌ అధికారులు నమోదు చేసిన ఓ డ్రగ్‌ కేసులో కీలక నిందితుడైన కెల్విన్‌ విచారణలో బయటపడిన అంశాల ఆధారంగానే రకుల్‌ను గత సెప్టెంబర్‌ 3న ప్రశ్నించింది. తాజాగా రకుల్‌ను ఏ అంశాలపై, ఎవరితో సంబంధాలపై, ప్రశ్నిస్తారనే ఉత్కంఠ నెలకొంది

ఇదీ చదవండి: హైదరాబాద్‌ నుంచి విదేశాలకు డ్రగ్స్‌

మరిన్ని వార్తలు