ఇది నా ఒక్కరి సమస్య కాదు.. ఈడీని ధైర్యంగా ఎదుర్కొంటా: ఎమ్మెల్సీ కవిత

9 Mar, 2023 14:00 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: లిక్కర్‌ స్కాం దేశ రాజకీయాల్లో ప్రకంపలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో​ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. కాగా, కవిత.. జంతర్‌ మంతర్‌లో ధర్నా కారణంగా ఈనెల 11వ తేదీన ఈడీ ఎదుట విచారణకు హాజరు కానుంది. అయితే, ధర్నాలో భాగంగా కవిత.. బుధవారమే ఢిల్లీ చేరుకున్నారు. 

ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ విచారణకు రెండు రోజుల సమయం అడిగాము. మాకు రెండు రోజుల సమయం ఇస్తే ఈడీకి వచ్చిన నష్టమేంటి?. మా ఇంటికి వచ్చి విచారణ చేయాలని ఈడీని రిక్వెట్‌ చేశాం. కానీ, ఈడీ దీనికి అంగీకరించలేదు. మహిళలను ఇంట్లో విచారించాలని చట్టం చెబుతోంది. ఇది నా ఒక్కరి సమస్య కాదు. ఈడీ ఎందుకింత హడావిడీగా వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదు. ఈడీ దర్యాప్తునకు వంద శాతం సహకరిస్తాం​. దర్యాప్తు సంస్థలు మహిళలను విచారించే పద్దతిపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఉద్యమం చేసి వచ్చాం.. భయపడే వాళ్లం కాదు. ఈడీని ధైర్యంగా ఎదుర్కొంటాం. దర్యాప్తును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎందుకు చేయరు అని ప్రశ్నించారు.  

200 మంది ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. బీఆర్‌ఎస్‌కు సంబంధించిన నేతల ఇళ్లలో కూడా దాడులు జరిగాయి. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయి. మేము భయపడే వాళ్లం కాదు. దేశంలో మోదీ-అదానీ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ నడుస్తోంది. మోదీకి అదానీ బినామీ అని పిల్లోడిని అడిగినా చెబుతాడు. తెలంగాణ నేతలను వేధించడం కేంద్రానికి అలవాలటైపోయింది. మోదీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే కేంద్రం ఈడీ దాడులు చేస్తోంది. విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. అధికారంలో లేని రాష్ట్రాల్లో మోదీ కంటే ముందు ఈడీ వస్తోంది. గాంధీ పుట్టిన దేశంలో అబద్ధం రాజ్యమేలుతోంది. ప్రధాని మోదీ బయటే కాదు పార్లమెంట్‌లోనూ అబద్ధాలు చెప్తున్నారు. ధర్మం ఎటువైపు ఉంటే వాళ్లదే విజయం. జైలులో పెట్టినంత మాత్రాన కృష్ణుడు జన్మించడం ఆగలేదు. అజ్ఞాతవాసం తర్వాత అర్జునుడు విజయం సాధించాడు. ఈడీ ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెబుతాను. మేము బీజేపీ బీ టీమ్‌ అయితే.. ఈడీ ఆఫీసుకు ఎందుకు వెళ్తున్నాము. నాతో పాటు ఎవరిని విచారించినా నాకేం ఇబ్బంది లేదు.

మహిళా బిల్లు కోసం 27 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. ఇంతవరకు పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందలేదు. బిల్లుపై ప్రభుత్వాలు మాట నిలబెట్టుకోలేకపోయాయి. అందుకే రేపు ఢిల్లీలో ధర్నా చేపడుతున్నాం. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నాలో మొత్తం 18 పొలిటికల్‌ పార్టీలు పాల్గొంటాయి అని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు