HYD: డేటా చోరీ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. ఈడీ ఎంట్రీ!

30 Mar, 2023 12:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డేటా చోరీ కేసు తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసు నమోదు చేసింది. ఈ కేసులో సైబరాబాద్‌ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసినట్టు తెలిపింది. 

ఇదిలా ఉండగా, అంతకుముందు.. దేశంలోనే అతి పెద్ద డేటా చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ప్రజల వ్యక్తిగత డేటాను విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 16.80 కోట్ల మంది డేటా చోరీ అయినట్లు గుర్తించారు. మరో 10 కోట్ల మంది డేటా చోరీ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. వెంటనే ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. 

డేటా చోరికి సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర మీడియాకు వివరించారు. డేటా చోరీ కేసు దర్యాప్తులో తేలిన వాస్తవాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఈ రోజు మీడియాకు వెల్లడించారు. డేటా చోరి స్కామ్‌లో పలు బ్యాంకుల క్రెడిట్ కార్డు జారీ చేసే ఏజెన్సీ ఉన్నట్లు గుర్తించామన్నారు. దేశంలోని కోట్ల మంది పర్సనల్ డేటా, గ్యాస్ డేటాను చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. పలు కంపెనీలు, బ్యాంకుల్లో ఇన్సూరెన్స్, లోన్ల కోసం అప్లై చేసుకున్న దాదాపు 4 లక్షల మంది డేటా చోరీకి గురైందని వెల్లడించారు. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగుల సెన్సిటివ్ డేటా కూడా చోరీకి గురైందని తేల్చారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వాడే 7 లక్షల మంది వ్యక్తిగత డేటా, వారి ఐడీలు, పాస్ వర్డులను సైబర్ నేరగాళ్లు దొంగిలించినట్లు స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: ‘దిశ’ కేసులో వాయిదాలు సరికాదు

మరిన్ని వార్తలు