స్పందించిన అధికారులు

5 Sep, 2020 10:40 IST|Sakshi
అదనపు కలెక్టర్‌ సంధ్యారాణికి వినతిపత్రం అందిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

సాక్షి, ఆదిలాబాద్‌‌: ‘చెప్పని చదువుకు ఫీజులు’ అనే శీర్షికన గురువారం సాక్షి జిల్లా టాబ్లాయిడ్‌లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఓ ప్రైవేట్‌ పాఠశాలలపై చర్యలు చేపట్టారు. లాక్‌డౌన్‌ సమయంలో పాఠశాలలు నడవకున్నా నెలవారీ ఫీజులు, పెనాల్టీ వసూలు చేస్తున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయడం జరుగుతుందని డీఈవో రవీందర్‌రెడ్డి తెలిపారు. ఫీజులు, పెనాల్టీలు కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులపై పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడి తీసుకువస్తే తన దృష్టి తీసుకురావాలని పేర్కొన్నారు. శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు ఆత్రం నగేష్, అన్నమొల్ల కిరణ్, తోట కపిల్‌ కలెక్టరేట్‌లోని చాంబర్‌లో అదనపు కలెక్టర్‌ సంద్యారాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ విచ్చలవిడిగా ఫీజులు వసూళ్లు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురి చేస్తున్న ఓ ప్రైవేటు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలన్నారు.

లాక్‌డౌన్‌ కాలానికి కూడా ఫీజులు వసూళ్లు చేస్తోందని, ప్రభుత్వం ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పడానికి అనుమతి ఇవ్వకముందే ఆన్‌లైన్‌ పాఠాలు బోధించిందని అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఫీజులు చెల్లించాలని సెల్‌ఫోన్‌లో మేసేజ్‌లు పంపుతోందని, ఆలస్యమైతే పెనాల్టీలు కూడా చెల్లించాల్సి వస్తుందని భయపెడుతున్నట్లు వివరించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్‌ విచారణ జరిపించాల్సిందిగా డీఈవోను ఆదేశించారు. దీంతో డీఈవో ఎంఈవో జయశీలను విచారణ అధికారిగా నియమించారు. విచారణ జరిపిన ఎంఈవో ఫీజులు, పెనాల్టీల వసూలు చేస్తున్నట్లుగా గుర్తించి డీఈవోకు నివేదించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు సదరు పాఠశాలకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు