ఆన్‌లైన్‌ పాఠం అర్థమయ్యేనా?

1 Sep, 2020 11:35 IST|Sakshi

కరోనా నేపథ్యంలో స్కూళ్లు తెరిచే అవకాశం లేకపోవడంతో విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం టీ శాట్‌ యాప్‌ ద్వారా డిజిటల్‌ తరగతులను నిర్వహించడంతో పాటు టీవీలోనూ తరగతులను కొనసాగించనున్నారు. అలాగే డీడీ యాదగిరి చానల్‌లోనూ నిర్దేశించిన సమయంలో వివిధ తరగతుల విద్యార్థులకు పాఠాలను బోధించనున్నారు. డిజిటల్, ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. 

సాక్షి, నిజామాబాద్‌: కరోనా మహమ్మారితో తరగతుల నిర్వహణ సాధ్యం కాని వేళ ప్రభుత్వం నేటి నుంచి విద్యార్థులకు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించబోతుంది. గతంలోనే అనుమతి లేనప్పటికీ కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలే ఆన్‌లైన్‌లో తరగతులను నిర్వహించాయి. ఈ విధానంలో బోధన అర్థం కావడం లేదని ఎక్కువశాతం మంది విద్యార్థులు చెబుతున్న వేళ ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతుల వేపే మొగ్గు చూపింది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు అర్థం కావడం కష్టంగా మారనుంది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. టీ షాట్‌ చానల్‌ ద్వారా ఆన్‌లైన్‌ బోధనను ఎంత మంది విద్యార్థులు ఆసక్తిగా వింటారని, గత మార్చి నుంచి ఇప్పటి వరకు విద్యకు దూరమైనవారు ఇప్పుడు టీవీలో ప్రసారమయ్యే ఆన్‌లైన్‌ తరగతలు వినే పరిస్థితి ఉందని పలువురు ప్రశ్నిస్తున్నారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు ఎక్కువగా వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి వచ్చినవారే ఉంటారు. ఉదయమే తల్లిదండ్రులు పొలంబాట పట్టడంతో విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలను వినే పరిస్థితి ఉండదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రతి ఏడాది జూన్‌లో తరగతులు ప్రారంభమై విద్యార్థులు, ఉపాధ్యాయులు సిబ్బందితో పాఠశాలలు కళకళలాడుతూ ఉండేవి. ఈ ఏడాది కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న నేపథ్యంలో పాఠశాలలు పునఃప్రారంభానికి నోచుకోలేదు.

10,700 మంది పిల్లల ఇంట్లో టీవీలు, సెల్‌ఫోన్లు  లేవు
ప్రభుత్వం టీ శాట్‌ ద్వారా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణలో ముఖ్యంగా నిరుపేద విద్యార్థులకు ఇబ్బందిగా మారనుంది. ఇంట్లో టీవీ లేకపోవడంతో ఇతర విద్యార్థులపై ఆధారపడాల్సి వస్తుంది. ముఖ్యంగా తండాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. టీవీలు లేని కుటుంబాలు జిల్లాలో ఎన్నో ఉన్నాయి. ప్రతి కుటుంబంలో ఆండ్రాయిడ్‌ ఫోన్‌లు ఉన్నప్పటికీ టీవీలు లేని ఇళ్ల చాలానే ఉన్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 10,700 మంది పిల్లలకు ఇళ్లల్లో టీవీలు, సెల్‌ఫోన్లు లేవని ఇటీవల విద్యాశాఖ నిర్వహించిన సర్వేలోనే తేలింది.

ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి జిల్లాలో 1,459 ప్రాథమిక పాఠశాలలు, 271 ప్రాథమికోన్నత పాఠశాలలు, 432 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధులకు హాజరవుతున్నారు. 
వారం రోజుల పాటు పునశ్చరణ తరగతులు 
ఆన్‌లైన్‌ తరగతులు ఆరంభిస్తున్న తరుణంలో వారం రోజుల పాటు విద్యార్థులకు పాత తరగతులకు సంబంధించి పాఠ్యాంశాలపై పునశ్చరణ తరగతులను నిర్వహించనున్నారు. మార్చిలో పూర్తి స్థాయిలో పాఠ్యాంశాలు ముగిసిపోక ముందే పాఠశాలలు మూసి వేశారు. అందువల్ల పాత తరగతులకు సంబంధించిన కొన్ని పాఠ్యాంశాల పునశ్చరణ తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి 
విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తుంది. టీ శాట్‌ ద్వారా అందించే బోధనను తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టి వినేలా చూడాలి. సందేహాలు వస్తే వెంటనే ఉపాధ్యాయుడికి ఫోన్‌ ద్వారా నివృతి చేసుకోవాలి.     –రాజు, డీఈవో, కామారెడ్డి

ప్రతి విద్యార్థి డిజిటల్‌ పాఠాలు వినాలి
ప్రతి తరగతి విద్యార్థి డిజిటల్‌ పాఠాలను కచ్చితంగా వినాల్సి ఉంది. డిజిటల్, ఆన్‌లైన్‌ తరగతులకు విద్యార్థులు హజరై హోం వర్క్‌ను పూర్తి చేయాలి. ఇప్పటికే అందరు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణి చేశాం. బడులకు విద్యార్థులు రాలేకున్నా డిజిటల్, ఆన్‌లైన్‌ తరగతులకు హజరు కావాల్సిందే.    – ఆంధ్రయ్య, ఎంఈవో, మోర్తాడ్

టీవీ, ఫోన్‌ లేదు
మా ఇంట్లో ఫోన్‌ లేదు, టీవీ లేదు. అమ్మ, నాన్న కూలీ పనులు చేసి మమ్మల్ని పోషిస్తున్నారు. పక్కింట్లో టీవీ చూసి పాఠాలు వినమంటుండ్రు. కరోనా భయంతో ఎక్కడివి వెళ్లే పరిస్థితి లేదు. - మహేందర్, తొమ్మిదో తరగతి, సింగితం ఉన్నత పాఠశాల 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా