విద్యా బోధన.. వయా వీడియో పాఠాలు

24 Jul, 2020 01:05 IST|Sakshi

కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలపై అధ్యయనం చేస్తున్న విద్యాశాఖ

వాటికి అనుగుణంగానే స్కూళ్ల నిర్వహణపై కసరత్తు

కొన్ని సమస్యల నేపథ్యంలో వీడియో పాఠాలకే ఎక్కువ ప్రాధాన్యం 

ఆన్‌లైన్‌ బోధన కష్టమేనంటున్న ఉన్నతాధికారులు..  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో విద్యా బోధన ప్రారంభానికి సంబంధించిన కసరత్తును విద్యాశాఖ వేగవంతం చేసింది. హైకోర్టుకు తమ విధానపర నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉన్నం దున కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఇటీవల ప్రజ్ఞత పేరుతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ మార్గదర్శ కాల ప్రకారమే ముందుకు సాగాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చి నట్లు తెలిసింది. అయితే అందులో ఆన్‌లైన్‌ బోధనతో పాటు రికార్డెడ్‌ వీడియో పాఠాల విధానం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రెండింటి పైనా విద్యాశాఖ ఆలోచనలు చేస్తోం ది. వీలు కలిగిన పట్టణ ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ బోధన చేపట్టాలని, వీలుకాని గ్రామీణ ప్రాంతాల్లో వీడియో పాఠాలను టీశాట్, దూర దర్శన్‌ (యాదగిరి), ఎస్‌సీఈఆర్‌టీ యూట్యూబ్‌ చానల్‌ వంటి వాటి ద్వారా బోధనను చేపట్టే అంశంపైనా పరిశీలన జరుపుతోంది.

ఆన్‌లైన్‌ బోధన చేపట్టాలంటే విద్యార్థులకు మొబైల్‌/ట్యాబ్‌ వంటివి అవసరం. అయితే విద్యార్థుల ఇళలో ఏ మేరకు ఆయా పరికరాలున్నాయో అనధికారిక సర్వే చేయాలని కేంద్రం ప్రజ్ఞతలో పేర్కొన్న నేపథ్యంలో ఆ దిశగా విద్యా శాఖ చర్యలు చేపట్టాలని భావి స్తోంది. కరోనా కొంత అదుపు లోకి వచ్చే వరకు ఆన్‌లైన్, వీడియో పాఠాలనే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత మాత్రం షిఫ్ట్‌ పద్ధతుల్లో బోధన చేపట్టే అంశాలను పరిశీలిస్తోంది. అందులోనూ ముం దుగా 9, 10 తరగతులకు బోధన నిర్వహించడం, కొన్ని రోజుల తర్వాత 6, 7, 8 తరగతులకు బోధన ప్రారంభించే అంశంపైనా పరిశీలన జరుపుతోంది. ఇక రెండు, మూడు నెలల తరువాతే ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధనను చేపట్టే అంశంపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

ప్రభుత్వ స్కూళ్లలో 90% వీడియో పాఠాలే..
రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ పాఠ శాలలుంటే అందులో 28 లక్షల మంది విద్యార్థులు చదువు తున్నారు. గురుకులాలు, ఇతర ప్రత్యేక విద్యా సంస్థలను మినహాయిస్తే 23 లక్షల మందికి పైగా విద్యార్థులు జిల్లా పరిషత్, ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. వీటిల్లో 90% మంది విద్యార్థులకు వీడియో పాఠాలే బోధించే అంశంపై పరిశీలన జరుపు తున్నట్లు తెలిసింది.  స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో ఉన్న విద్యార్థులకు మాత్రం ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించే అంశాన్ని కూడా  పరిశీలిస్తున్నారు. అయితే ఇంతవరకు దేనిపైనా ఓ కచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయారు. వివిధ కోణాల్లో పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు.

ప్రైవేటులోనూ ఎక్కువ శాతం వీడియో పాఠాలవైపే..
రాష్ట్రంలోని 10 వేలకు పైగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 31 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 2 వేలకు పైగా ఉన్న కార్పొరేట్, సెమీ కార్పొరేట్, ఇంటర్నేషనల్, ప్రముఖ పాఠశాలలు మాత్రమే ఆన్‌లైన్‌ పాఠాలను ప్రారంభించాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలు, ఇతర జిల్లా కేంద్రాల్లోని మెజారిటీ ప్రైవేటు పాఠశాలలు ఇంకా ఆన్‌లైన్‌ బోధన చేపట్టలేదు. ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నా ఆచరణ ఎంత మేరకు సాధ్యమవుతుందన్న విషయంపై తర్జన భర్జన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలలు కూడా కొన్నాళ్ల వరకు వీడియో పాఠాల వైపే మొగ్గు చూపే అవకాశముంది.

ఆన్‌లైన్‌ కష్టసాధ్యం.. అమలు చేసినా కొద్దిసేపే..
రాష్ట్రంలో వీలున్న స్కూళ్లలో ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభిస్తే కేంద్రం ఆదేశాల ప్రకారం ప్రతి తరగతికి 2 నుంచి 3 గంటలే ఆన్‌లైన్‌ బోధన చేపట్టే అవకాశముంది. ఉన్నత పాఠశాల్లో గరిష్టంగా 4 సెషన్లలోనే, 1 నుంచి 8 తరగతులకు రెండు సెషన్లలోనే బోధనను నిర్వహించేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అంతకుమించి ఎక్కువ బోధన చేపట్టే వీలుండదని, పైగా ఆన్‌లైన్‌ బోధనకు టీచర్లను గుర్తించి, వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని, ఇది కష్టసాధ్యమని పేర్కొన్నారు. వీటన్నింటికంటే వీడియో పాఠాలే ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుందని వెల్లడించారు.  

మరిన్ని వార్తలు