అమెరికాలో విద్యావకాశాలపై ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ 

22 Aug, 2021 04:05 IST|Sakshi

వర్చువల్‌ కార్యక్రమంలో పాల్గొననున్న 100కు పైగా యూఎస్‌ వర్సిటీలు 

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో విద్యావకాశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల కోసం అక్కడి వర్సిటీలు వర్చువల్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ను నిర్వహించనున్నాయి. గుర్తింపు పొందిన వందకుపైగా యూఎస్‌ వర్సిటీలు, కాలేజీలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ ద్వారా సంభాషించడానికి ఈ కార్యక్రమం ద్వారా ఉచితంగా అవకాశం కల్పించనున్నారు. మాస్టర్స్‌ లేదా పీహెచ్‌డీ కోర్సులపై ఈ నెల 27న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు గ్రాడ్యుయేట్‌ ఫెయిర్‌ జరగనుంది. ఇందులో పాల్గొనడానికి ( https://bit.ly/EduSAFair21EmbWeb) లింక్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ కార్యాలయం సూచించింది. 

వచ్చే నెల 3న బ్యాచిలర్స్‌ కోర్సులపై.. 
బ్యాచిలర్స్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల కోసం సెప్టెంబర్‌ 3న సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వెబ్‌ లింక్‌ (https://bit.ly/ UGEdUSAFair21 Emb Web) ద్వారా రిసిస్ట్రేషన్‌ చేసుకోవాలి. యూఎస్‌లోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ఉన్నత విద్యాసంస్థలు ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌లో పాల్గొంటాయి. అండర్‌ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, డాక్టొరల్‌ స్థాయిల్లో కోర్సులు అందిస్తున్నాయి.

యూఎస్‌ విశ్వవిద్యాలయాలు, ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ విభాగం సలహాదారులతో ఈ ముఖాముఖి ఉంటుంది. అమెరికాలో చదువులు, ఫండింగ్, స్కాలర్‌షిప్‌లు, ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ తదితర విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి ముఖాముఖి సాయపడుతుంది. విద్యార్థి వీసాల గురించి యూఎస్‌ బ్యూరో ఆఫ్‌ కాన్సులర్‌ అఫైర్స్‌ అధికార వర్గాల నుంచి విద్యార్థులకు అవసరమైన సమాచారం లభించనుంది. పూర్తి వివరాల కోసం (https://drive.google.com/drive/floders/1 dcOlvRx6 AQkZGBU9 URf1 lblqMU&pXZMm) వీడియో లింక్‌ను సందర్శించాలని యూఎస్‌ కాన్సులేట్‌ సూచించింది. 

మరిన్ని వార్తలు