వచ్చే నెలలో ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ 

21 Oct, 2021 10:25 IST|Sakshi

మేనేజ్‌మెంట్‌ కోటా గడువు పెంపు

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే రెండో దశ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను నవంబర్‌ మొదటి వారంలో నిర్వహించే వీలుందని ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల కేటాయింపు తుది గడువు ఈ నెల 30 వరకు పొడిగించాలని నిర్ణయించారు. హైకోర్టు తీర్పుతో కొత్తగా వచ్చే కంప్యూటర్‌ సైన్స్‌ గ్రూపు సీట్లను రెండో కౌన్సెలింగ్‌ పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు తొలి విడత సీట్లు పొందిన విద్యార్థుల్లో కొంతమంది జాతీయ విద్యాసంస్థల్లోకి వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఖాళీ అయ్యే సీట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అన్ని సీట్లు కలిపి 50 వేల వరకూ ఉంటాయి. వీటిల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు ఈ నెల 30 వరకూ సెల్ఫ్‌ రిపోరి్టంగ్‌ చేస్తారు.   

జేఎన్‌టీయూహెచ్‌ పీహెచ్‌డీ వెబ్‌ నోటిఫికేషన్‌ విడుదల 
కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్‌): జేఎన్‌టీయూహెచ్‌ ఫుల్‌టైమ్‌ పీహెచ్‌డీ వెబ్‌ నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేశారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి డాక్టోరియల్‌ ఫెలోషిప్‌ స్కీమ్‌లో భాగంగా అన్ని ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు గత ఐదేళ్ల కాలంలో నెట్, గేట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు నిర్దేశిత ఫీజు, ధ్రువీకరణ పత్రాలు అడ్మిషన్‌ విభాగానికి పంపాలని అడ్మిషన్స్‌ విభాగం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వెంకట రమణారెడ్డి తెలిపారు.
 

మరిన్ని వార్తలు