ప‌శువుల ఆసుప‌త్రిలో వృద్ధ‌దంప‌తుల పాట్లు

24 Sep, 2020 16:30 IST|Sakshi

సాక్షి, మెద‌క్ : వృద్ధ దంప‌తులు..అందులోనూ దివ్యాంగులు ఇలాంటి ప‌రిస్థితుల్లో  ఉన్న త‌ల్లిదండ్రుల‌ను కంటికి రెప్ప‌లా చూసుకోవాల్సిన కొడుకు ముఖం చాటేశాడు. తిన‌డానికి తిండిలేక‌, ఉండ‌టానికి కూసింత చోటు లేక ప‌శువుల ఆసుప‌త్రిలో అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. త‌మ‌ను ఆదుకోవాల‌ని వేడుకుంటున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన నాగయ్య అంజమ్మ అనే వృద్ధ దంపతులు ఒకప్పుడు బాగానే బతికారు కానీ  ఆస్తులు కరిగిపోయిన తర్వాత కొడుకు ముఖం చాటేయడంతో కష్టాలు మొదలయ్యాయి.

అంజ‌మ్మ అంధురాలు. నాగ‌య్య న‌డ‌వ‌లేడు దీనికి తోడు వినికిడి లోపం. భిక్షాట‌న చేస్తూ వాళ్లు పెడితే తిన‌డం లేక‌పోతే ప‌స్తులుండ‌టం. ఇంత‌టి ద‌య‌నీయ స్థితిలో పాడుప‌డిన ప‌శువుల ఆసుప‌త్రిలో జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ కొడుకు మాత్రం ప‌ట్టించుకోకుండా ఇలా వ‌దిలేయడంపై గ్రామ‌స్తులు మండిప‌డుతున్నారు.  అత‌నిపై రామాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌన్సిలింగ్‌కు పిలిపించిన పోలీసులు అత‌న్ని మంద‌లించి ఇప్ప‌టికైనా కాసింత సాయ‌ప‌డాల్సిందిగా కోరారు. ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి పెన్ష‌న్ అంద‌ట్లేద‌ని ఈ సంద‌ర్భంగా వృద్ధ‌దంప‌తులు పోలీసులకు చెప్ప‌గా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామ‌ని హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు