‘సోషల్‌’ కూత!

17 Sep, 2020 11:48 IST|Sakshi

గ్రేటర్‌లో నాలుగు నెలలకు ముందే మొదలైన ఎన్నికల ప్రచారం

సోషల్‌ మీడియాలో టీఆర్‌ఎస్‌ వర్గాల జోరు

పూర్తయిన ఫ్లై ఓవర్లు, అభివృద్ధి తదితర పోస్టింగులతో హడావుడి

సాక్షి, సిటీబ్యూరో: బల్దియా ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలకుపైగా సమయం ఉంది. జరగాల్సిన బీసీ ఓటర్ల సర్వే..వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసి ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయ్యేందుకు కూడా ఎంతో సమయం పట్టే చాన్స్‌ ఉంది. సాధారణంగా ఏ  ఎన్నికలకైనా ఎన్నికల నోటిఫికేషన్‌కు అటూ ఇటూగా ఆయా పార్టీలు ప్రచారాలు నిర్వహిస్తాయి. కానీ, బల్దియా ఎన్నికలకు మాత్రం సోషల్‌ మీడియాలో ఈపాటికే ప్రచారం మొదలైంది. ప్రత్యేకంగా అది ఎన్నికల కోసమని చెప్పకపోయినా ఇటీవల పలువురు టీఆర్‌ఎస్‌కు చెందిన నేతలు ట్విట్టర్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో జరిగిన పనుల గురించి పోస్ట్‌ చేస్తున్నారు. వాటిల్లో ముఖ్యంగా బయోడైవర్సిటీ పరిసరాల్లో, ఎల్‌బీనగర్‌ చుట్టుపక్కల పూర్తయిన ఫ్లై ఓవర్లతో కూడిన వీడియో క్లిప్‌లు ఉంచుతున్నారు. ఒకే స్క్రీన్‌లో నాలుగైదు ఫ్లై ఓవర్లను జోడిస్తున్నారు.

వీటితోపాటు కొల్లూరు, రాంపల్లి తదితర ప్రాంతాల్లో భారీసంఖ్యలోని డబుల్‌ఇళ్లనూ ఉంచుతున్నారు. ఇక దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జి ఎన్నో రోజులుగా ప్రచారంలో ఉంది. ఇవన్నీ ఎందుకంటే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి రాబోయే బల్దియా ఎన్నికలకు లబ్ధిచేకూర్చేందుకేనని, అది ఎన్నికల ప్రచారమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధిని ఇలా ప్రజల ముందుంచడం ద్వారా ముందస్తుగానే దూసుకుపోయేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులతోపాటు పార్టీ అభిమానులూ ఈ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు కార్పొరేటర్లు తాము చేస్తున్న పనులు, క్షేత్రస్థాయి పర్యటనల ఫొటోలు, వీడియోక్లిప్స్‌తో ప్రత్యేక వాట్సప్‌ గ్రూప్‌లు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రైవేట్‌ సంస్థలు నిర్వహిస్తున్న యూట్యూబ్‌ చానెళ్లలోనూ తమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు తదితరమైనవి ఉంచుతున్నారు. మరోవైపు తమ సీటు తమకే తిరిగి దక్కేందుకుగాను మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ను కలిసి తాము చేసిన పనులు, చేయనున్న పనుల గురించి వివరిస్తున్నారు. 

పనుల్లో దూకుడు..
తమ పరిధిలోని మౌలిక సదుపాయాలు,అభివృద్ధికి సంబంధించిన పనుల్ని సత్వరం పూర్తిచేయాల్సిందిగా అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఉన్నతస్థాయిలోని టీఆర్‌ఎస్‌ నేతలు సైతం  పబ్లిక్‌టాయ్‌లెట్లు,పార్కుల వంటి పనులు వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో, వీలైనంత సత్వరం పూర్తిచేయాల్సిందిగా సూచిస్తున్నారు. 

ఇప్పటికే రూ.50 వేల కోట్ల అభివృద్ధి పనులు: మేయర్‌ 
దేశంలోని నివాసయోగ్య, ఉపాధి, తదితర అంశాలపై 34 నగరాల్లో హాలిడిఫై.కామ్‌ వెబ్‌సైట్‌ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్‌ అత్యుత్తమ నగరంగా నిలవడంపై మేయర్‌ బొంతు రామ్మోహన్‌ హర్షం వ్యక్తం చేశారు. నగరంలో  వివిధ రంగాల్లో రూ. 50 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని, రాబోయే ఐదేళ్లలో మరో రూ.40 వేల కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలోని నీటికొరత, విద్యుత్‌ సమస్యలు ఇప్పుడు లేవని, హైదరాబాద్‌ నగరం పెట్టుబడులు పుంజుకోవడానికి, నివాసయోగ్యతకు అనువైన నగరమని పేర్కొన్నారు. 

బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు జరపాలి
రాష్ట్రంలో నిర్వహించిన మునిసిపల్‌ ఎన్నికల తరహాలోనే రాబోయే బల్దియా ఎన్నికలను కూడా బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించాలని  హైదరాబాద్‌ జిల్లా టీడీపీ నాయకులు కోరారు.  ఈ మేరకు  సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పి.సాయిబాబా ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల అధికారిని కలిసిన వారిలో నల్లెల కిశోర్, ముప్పిడి మధుకర్, పి.బాలరాజ్‌గౌడ్‌ తదితరులున్నారు. 

ఓటీఎస్‌ వినియోగించుకోండి : జీహెచ్‌ఎంసీ కమిషనర్‌
ఆస్తిపన్ను బకాయిలున్నవారికి బకాయిల వడ్డీలపై 90 శాతం రాయితీనిస్తూ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌)ను వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వం ఈస్కీమ్‌ గడువునుఅక్టోబర్‌ 31 వరకు పొడిగించినందున స్కీమ్‌ ప్రయోజనం పొందాల్సిందిగా సూచించారు. జీహెచ్‌ఎంసీలో ఇలాంటి బకాయిలున్నవారు మొత్తం 5.41 లక్షల భవనాల యజమానులుండగా, ఇప్పటి వరకు 78వేల మంది మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. తద్వారా జీహెచ్‌ఎంసీకి దాదాపు రూ. 174 కోట్లు వసూలయ్యాయి.

మరిన్ని వార్తలు