జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో భేటీ

12 Nov, 2020 13:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో జరగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి‌ గురువారం సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల కమిషనర్‌‌ రాజకీయ పార్టీలతో జరిపిన వరుస భేటీల్లో భాగంగా సీపీఐ, బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, బీజేపీ నుంచి ఎన్‌వీఎస్ఎస్‌ ప్రభాకర్‌, చింతల, ఆంటోని రెడ్డిలు పాల్గొన్నారు. అన్నిపార్టీలతో  గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణపై కమిషనర్‌ చర్చించారు. కాగా ఈ భేటీలకు గుర్తింపు పొందిన 11 పార్టీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆహ్వానించింది. ఒక్కో రాజకీయ పార్టీకి 15 నిమిషాల సమయం కేటాయించి, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణపై సమాలోచనలు జరిపింది.

భేటీ అనంతరం చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వరదల సాయం అందరికీ అందలేదన్నారు. ఒక్కో డిజవిన్‌లో జనాభా సంఖ్యలో చాలా తేడా ఉందని, లోపాలు సరిదిద్దుకుని ఎన్నికలకు వెళ్లాలని సూచించారు.

బీసీలకు అన్యాయం జరుగుతోంది:
కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ..  నవంబర్ 7వ తేదీ విడుదల చేసిన ఓటర్ల జాబితా వార్డుల వారిగా విడుదల చేశారని అది సరైన పద్ధతి కాదన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 25 శాతం పోలింగ్ కేంద్రాలను అదనంగా పెంచాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు సమయాన్ని మరో 15 రోజులు పెంచాలన్నారు. మున్సిపల్ సిబ్బంది ఇతర పనుల్లో బిజీగా ఉన్నారని, తూతూ మంత్రంగా ఎన్నికలు నిర్వహించొద్దన్నారు. ఎన్నికల ప్రక్రియకు అవసరం అయిన అన్నింటికీ మళ్లీ రీ షెడ్యూల్ ఇవ్వాలని కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉల్లంఘించకూడా రిజర్వేషన్లుఉండాలని, బీసీలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం 50 సీట్లు మాత్రమె కేటాయిస్తున్నారని, వాస్తవానికి 75 సీట్లు బీసీలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధన ఉందని, దాన్ని కొనసాగించాలన్నారు. ప్రకటనల విషయాల్లో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు.

ఎన్నికలకు భయపడటం లేదు:
పీసీసీ నేత నిరంజన్ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఆదరబాదరగా నిర్వహించొద్దని తెలిపారు. తాము ఎన్నికలకు భయపడటం లేదని స్పష్టం చేశారు. గతంలో జరిగిన లోటుపాట్లు సరిచేయలని సూచించామని పేర్కొన్నారు. అభ్యర్థుల పేర్లు హిందీలో కూడా ప్రచురించాలని కోరినట్లు తెలిపారు.

పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలి:
సమావేశం అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఎస్ఈసీ కోరామని తెలిపారు. సెక్యూరిటీ డిపాజిట్, అభ్యర్థి ఖర్చును పెంచాలన్నారు. మాస్కులు తప్పనిసరి చేయాలన్నారు. విశాలమైన పోలింగ్ కేంద్రాలు గుర్తించాలని కోరినట్లు తెలిపారు. కోవిడ్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వికలాంగులకు, కోవిడ్ పాజిటివ్ కేసుల్లో పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశామన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భరత్‌  మాట్లాడుతూ.. సోషల్ మీడియాపై నిఘా పెంచి, ఒక ప్రత్యేక సెల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేయాలన్నారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఓటు హక్కు ఎలా ఇచ్చారు?
ఎన్నికల కమిషన్‌తో సమావేశం ముగిసిన అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ... ‘ఓటరు జాబితాలో అవకతవకలను ఈసీ దృష్టికి తెచ్చాం. పోలింగ్ బూత్ వారీగా ఓటర్ జాబితా ఇవ్వాలని కోరాం. అధికారులు కార్పొరేటర్లతో కుమ్మక్కై బీజేపీ అనుకూల ఓట్లను తొలగించారు. జీహెచ్‌ఎంసీ అధికారులను ప్రిసైడింగ్ అధికారులుగా నియమించొద్దు. కేంద్ర ప్రభుత్వ సిబ్బందితో ఎన్నికలు నిర్వహించాలి. బీసీ రిజర్వేషన్లు ఇతర మున్సిపాలిటీల్లో ఒక రకంగా... జీహెచ్‌ఎంసీలో మరో రకంగా ఎలా కేటాయిస్తారు?. శాస్త్రీయ విధానంలో ఇంటి నెంబర్లు ఎందుకివ్వలేదు?. అనుమతి లేకుండా నిర్మించిన ఇళ్లలో ఉన్నవారికి ఓటు హక్కు ఎలా ఇచ్చారు?. డీలిమిటేషన్ లేదంటూనే ఓట్లను తారుమారు చేశారు’ అని ఆరోపించారు.

మరిన్ని వార్తలు