నేడు నిజామాబాద్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌

9 Oct, 2020 01:46 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: శాసన మండలి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక శుక్రవారం జరగనుంది. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. స్థానిక సంస్థల్లో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఫలితాలు ఏకపక్షంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప.. ఈ ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి.

మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే ఎక్కువ ఓటర్లు ఉండటంతో పాటు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ప్రజాప్రతినిధుల చేరికలతో ఆ పార్టీ జోరు మీద ఉంది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో ఇటీవల పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరికలు జరిగాయి. మరోవైపు వలసలతో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు కుదేలయ్యాయి. దీంతో ఈ రెండు జాతీయ పార్టీలు డిపాజిట్లు దక్కించుకోవడం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వి.సుభాష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పోతనకర్‌ లక్ష్మీనారాయణలు బరిలో ఉన్నారు.  

పార్టీల బలాబలాలు 
జిల్లాలో అన్ని స్థానిక సంస్థల్లో మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, 413 మంది ఓటర్ల మొదటి ప్రాధాన్యత ఓట్లు దక్కితే విజయం వరిస్తుంది. మొత్తం ఓటర్లు 824లో టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు 504 మంది ఉన్నారు. దీంతో మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే ఎక్కువే టీఆర్‌ఎస్‌కు సొంత బలం ఉంది. దీనికి తోడు మిత్ర పక్షమైన ఎంఐఎం ప్రజాప్రతినిధులు 28 మంది కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితకు మద్దతుగా ఓటేసే అవకాశాలు ఉన్నాయి. స్వతంత్రులు 66 మంది ఉండగా, ఇప్పటికే దాదాపు అందరూ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న వారే. కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు 142 మంది ఉన్నారు.

ఇందులో ఇప్పటికే 75 మంది కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ బలం సుమారు 67కు తగ్గింది. అలాగే బీజేపీకి 85 మంది ప్రజాప్రతినిధులు ఉండగా.. ఇప్పటి వరకు 35 మందికి పైగా కారెక్కారు. టీఆర్‌ఎస్‌ సొంత బలం, ఎంఐఎం, స్వతంత్రులు, కాంగ్రెస్, బీజేపీల నుంచి వచ్చిన వారితో కలిపి తమకు సుమారు 700 మించి ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం ఖాయమనే ధీమాతో గులాబీ శ్రేణులు ఉన్నాయి. 

క్రాస్‌ ఓటింగ్‌పైనా ఆందోళన 
భారీ వలసలతో కుదేలైన ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు క్రాస్‌ ఓటింగ్‌ భయం కూడా పట్టుకుంది. పోయిన వారు పోగా, మిగిలిన వారైనా తమ అభ్యర్థులకు ఓటేస్తారా.? లేదా క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడతారా..? అనే ఆందోళనలో ఆ రెండు పార్టీలు ఉన్నాయి. ఇలా క్రాస్‌ ఓటింగ్‌ కూడా జరిగితే ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కే అవకాశాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

మరిన్ని వార్తలు