Huzurabad Bypoll: ఈవీఎం గల్లంతవలేదు

1 Nov, 2021 01:45 IST|Sakshi
వీవీప్యాట్‌యంత్రాన్ని కారులో పెడుతున్న డ్రైవర్‌

రిటర్నింగ్‌ అధికారి రవీందర్‌రెడ్డి స్పష్టీకరణ

పాడైన వీవీప్యాట్‌నే తరలించాం.. ఈవీఎంను కాదు

సోషల్‌ మీడియాలో జరిగింది దుష్ప్రచారమే... అయినా ఘటనపై విచారణ చేస్తున్నాం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నికకు సంబంధించి ఈవీఎం గల్లంతవలేదని రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం రాత్రి ఓ ఈవీఎంను అక్రమంగా తరలించారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం కావడం, ఈవీఎంలు భద్రపరిచిన ఎస్‌ఆర్‌ ఆర్‌ కళాశాల వద్ద వీవీప్యాట్‌ యంత్రాన్ని బస్సు నుంచి కారులోకి మారుస్తున్న వీడియో వైరల్‌ అయిన నేపథ్యంలో ఈ అంశంపై ఆయన వివరణ ఇచ్చారు.

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వీడియో తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం జరిగిందన్నారు. వాస్తవానికి అది ఈవీఎం కాదని, వీవీప్యాట్‌ యంత్రమని పేర్కొన్నారు. పోలింగ్‌ స్టేషన్‌–200లో మాక్‌ పోలిం గ్‌ సమయంలో ఒక వీవీ ప్యాట్‌ యంత్రం పనిచేయలేదని, అందుకే రిజర్వ్‌లో ఉన్న మరో యంత్రాన్ని వినియోగించామని తెలిపారు. మొరాయించిన  యంత్రాన్ని బస్సులో బందోబస్తు మధ్య కరీంనగర్‌ లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలకు తరలించామన్నారు.

అయితే అప్పటికే అక్కడ 150 బస్సులు పార్కు చే యడంతో స్థలాభావం వల్ల కాలేజీ ఆవరణకు ముం దే ఆ బస్సును నిలిపివేశారని తెలిపారు. సెక్టోరియ ల్‌ అధికారి సూచనల మేరకు ఆయన డ్రైవర్‌ వీవీప్యాట్‌ యంత్రాన్ని బస్సులోంచి కారులోకి మార్చా రని రవీందర్‌రెడ్డి వివరించారు. దీన్ని గుర్తుతెలి యని వ్యక్తులు వీడియో తీసి సామాజిక మాధ్యమా ల్లో తప్పుగా ప్రచారం చేశారన్నారు.

అయినప్పటికీ దీనిపై విచారణ జరుపుతున్నామని, ఒకవేళ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జమ్మికుంటలో ఈవీఎంలు తరలిస్తున్న బస్సు విషయంలోనూ వదం తులు వచ్చాయని విలేకరులు ప్రశ్నించగా బస్సు టైరు పంక్చర్‌ అయితే దాన్ని మార్చారే తప్ప ఈవీఎంలను మార్చలేదని రవీందర్‌రెడ్డి వివరించారు. 

రికార్డు స్థాయిలో పోలింగ్‌.. 135 కేసులు నమోదు.. 
హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 86.64% పోలింగ్‌ నమోదైందని ఆర్డీవో రవీందర్‌రెడ్డి ప్రకటించారు. మొత్తం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద 135 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసుల్లో నిందితులంతా విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టంచేశారు. అయితే ఇందులో రాజకీయ నాయకులు, ఓటర్లు ఎందరో చెప్పేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. 

ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ వద్ద విపక్షాల ధర్నా.. 
ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ వద్ద భద్రపరిచిన ఈవీఎంలను అధికారులు మార్చారని ఆరోపిస్తూ శనివారం రాత్రి కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ అనుచరులతో కలసి కాలేజీ లోపలకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఏసీపీ తులా శ్రీనివాసరావు.. బల్మూరి వెంకట్‌ మధ్య వాగ్వాదం జరిగింది. ఈవీఎంను కారులో ఎలా తరలిస్తారంటూ వెంకట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.

ఏసీపీ తుల శ్రీనివాసరావుతో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ 

దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఈవీఎంల తరలింపులో అక్రమాలు జరిగాయని, ఓడిపోతామన్న భయంతోనే అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బీజేపీ నేత, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ ఆధ్వర్వంలో బీజేపీ కార్యకర్తలు ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ ఎదుట బైఠాయించారు. ఇదే విషయమై ఆదివారం కూడా నిరసనలు కొనసాగాయి. నియోజకవర్గంలోని జమ్మికుంట, వీణవంక మండలాలు, కరీంనగర్‌ పట్టణంలోనూ బీజేపీ జిల్లా నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

మరిన్ని వార్తలు