తెలంగాణ: ఒకేసారి ఏడు పురపాలక ఎన్నికలు!

2 Jan, 2021 05:13 IST|Sakshi

ఏప్రిల్‌/ మేలో ఏడు పురపాలికలకు ఎన్నికలు! 

వార్డుల డీలిమిటేషన్, రిజర్వేషన్ల ఖరారు చేయాలని ప్రభుత్వానికి ఎస్‌ఈసీ లేఖ  

మార్చి– ఏప్రిల్‌లలో గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం, అచ్చంపేట, సిద్దిపేట కౌన్సిళ్ల గడువు పూర్తి 

ఇప్పటికే పెండింగ్‌లో జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీల ఎన్నికలు  

సాక్షి, హైదరాబాద్‌: మినీ ‘పుర పోరు’కు రంగం సిద్ధమవుతోంది. ఏడు పురపాలికల ఎన్నికలకు కసరత్తు మొదలుకానుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం... ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసింది. గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు త్వరలో ఒకేదఫా ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి వచ్చే ఏప్రిల్‌ లేదా మే నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లు, అచ్చంపేట (నాగర్‌కర్నూల్‌ జిల్లా) మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు 2021 మార్చి 14తో ముగియనుండగా, సిద్దిపేట పాలకవర్గం గడువు ఏప్రిల్‌ 15తో తీరనుంది. గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా హోదా పెరిగిన నకిరేకల్‌ (నల్లగొండ జిల్లా), జడ్చర్ల (మహబూబ్‌నగర్‌ జిల్లా), కొత్తూరు (రంగారెడ్డి జిల్లా)లకు గతంలో ఎన్నికలు నిర్వహించలేదు. ఈ పంచాయతీల ఐదేళ్ల పదవీకాలం అప్పట్లో పూర్తికాకపోవడమే దీనికి కారణం.  

త్వరలో వార్డుల  పునర్విభజన షెడ్యూల్‌! 
తెలంగాణ మున్సిపల్‌ చట్టం–2019 ప్రకారం... పురపాలికల పాలకవర్గాల గడువు ముగింపునకు మూడు నెలల ముందు నుంచే తదుపరి ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించాలి. ఈ నేపథ్యంలో ఈ ఏడు పురపాలికల్లో ఎన్నికలు నిర్వహించేందుకు వెంటనే కసరత్తు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట పురపాలికల్లో శివారు గ్రామ పంచాయతీలు, ప్రాంతాలు విలీనం కావడం, వార్డుల సంఖ్య సైతం పెరగడంతో ఈ పట్టణాల్లో వార్డుల పునర్విభజన, వార్డుల రిజర్వేషన్లను చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలికల్లోనూ ఈ కసరత్తు జరగాల్సి ఉంది.

ఎన్నికల సంఘం నుంచి సూచనలు అందడంతో వార్డుల పునర్విభజన ప్రక్రియ కోసం త్వరలో రాష్ట్ర పురపాలక శాఖ షెడ్యూల్‌ జారీ చేసే అవకాశాలున్నాయి. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం–2021లో భాగంగా జనవరి 15న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం శాసనసభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించనుంది. దీని ఆధారంగానే ఏడు పురపాలికలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. డివిజన్లు/ వార్డుల పునరి్వభజన, చైర్‌పర్సన్, వార్డుల రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన ప్రక్రియను సైతం ఫిబ్రవరిలోగా పూర్తి చేసే అవకాశాలున్నాయి.  

సాగర్‌ ఉపఎన్నిక తర్వాతే పురపోరు 
నాగార్జున సాగర్‌ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికతో పాటు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిసిన తర్వాతే మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చిలోగా సాగర్‌ ఉప ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయితే ఏప్రిల్‌ లేదా మేలో ఏడు పురపాలికలకు ఎన్నికలు నిర్వహించే అవకాశముంది.   

మరిన్ని వార్తలు