సిబ్బంది ద్వారానే కరెంట్‌ తీసుకోండి

30 Aug, 2022 01:17 IST|Sakshi

గణేశ్‌ మండపాల్లో జాగ్రత్తలు పాటించాలని ‘దక్షిణ’డిస్కం సీఎండీ విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: వినాయక చవితి సందర్భంగా గణేశ్‌ మండపాలకు కరెంట్‌ కనెక్షన్‌ కోసం సామాన్యులు విద్యుత్‌ స్తంభాలు ఎక్కరాదని, విద్యుత్‌ సిబ్బంది ద్వారానే కనెక్షన్‌ పొందాలని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎండీ జి.రఘుమారెడ్డి విజ్ఞప్తి చేశారు. గణేశ్‌ మండపాలకు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మండపాల వద్ద తీసుకో వాల్సిన భద్రతాచర్యలపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మండపాల వద్ద జాగ్రత్తలు పాటించాలని నిర్వాహకులను కోరారు.  

ముఖ్యమైన జాగ్రత్తలు..: మండపాల్లో ఉపయోగించే విద్యుత్‌ పరికరాల లోడ్‌కు తగ్గట్టు నాణ్యమైన కేబుల్స్‌ను వాడాలి. అతుకులు ఉన్న, ఇన్సులేషన్‌ లేని వైర్లను వాడటం ప్రమాదకరం.  ∙మండపాల్లో లోడ్‌కు తగ్గ సామర్థ్యం కలిగిన ఎంసీబీ (మినియేచర్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌) లను తప్పనిసరిగా వాడాలి. ఒక వేళ ఎంసీబీలు ఓవర్‌ లోడ్‌కు గురైతే షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.

∙విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద గణేశ్‌ మండపాలను ఏర్పాటు చేయరాదు.  ∙విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల దిమ్మెలను మండపాలకు సపోర్ట్‌ కోసం వాడరాదు. – విద్యుత్‌ వైర్లు, స్తంభాలు, ఇతర ప్రమాదకర పరికరాల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి.  ∙ఒక వేళ ఎవరికై నా కరెంట్‌ షాక్‌ తగిలితే వెంటనే వైద్య సహాయం అందించి, ఆ ప్రమాదం గురించి దగ్గరలోని విద్యు త్‌ సిబ్బందికి తెలియజేయాలి.  ∙విద్యుత్‌ వైర్లు ఎక్కడైనా తెగిపడ్డా, ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినా వెంటనే 1912 లేదా 100 లేదా సమీపంలోని ఫ్యుజ్‌ ఆఫ్‌ కాల్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి.
 

మరిన్ని వార్తలు