ట్రూఅప్‌ వసూళ్లు నిబంధనలకు విరుద్ధం 

25 Feb, 2023 05:20 IST|Sakshi

ట్రూఅప్‌ చార్జీలను అనుమతించొద్దు

ఏఆర్‌ఆర్, టారిఫ్‌ లేకుండా  ట్రూఅప్‌ వసూళ్లు నిబంధనలకు విరుద్ధం 

ఈఆర్సీ బహిరంగ విచారణలో నిపుణులు,

పారిశ్రామిక, రైతు, వ్యవసాయ సంఘాల వాదనలు 

వినియోగదారుల నుంచి ట్రూఅప్‌ చార్జీలు వసూలు చేసేందుకు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లను అనుమతించరాదని విద్యుత్‌రంగ నిపుణులు, పారిశ్రామిక, రైతు, వినియోగదారుల సంఘాలు విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి విజ్ఞప్తి చేశాయి. డిస్కంలు 2019–20, 2020–21, 2021–22 సంవత్సరాలకు సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌), టారిఫ్‌ ప్రతిపాదనలను సమర్పించలేదని, అందువల్ల వాటికి సంబంధించిన ట్రూఅప్‌ చార్జీల వసూళ్లకు నిబంధనలు అనుమతించబోవని స్పష్టం చేశాయి.

2016–17 నుంచి 2022–23 మధ్య కాలానికి రూ. 12,015 కోట్ల పవర్‌ పర్చేజ్‌ ట్రూఅప్‌ చార్జీలు, 2006–21 కాలానికి రూ. 4,092 కోట్ల డి్రస్టిబ్యూషన్‌ ట్రూఅప్‌ చార్జీలు కలిపి మొత్తం రూ.16,107 కోట్ల ట్రూఅప్‌ చార్జీల భారాన్ని మోపాలని డిస్కంలు చేసిన ప్రతిపాదనలను అనుమతించరా దని ఈఆర్‌సీకి విజ్ఞప్తి చేశాయి. డిస్కంల ఏఆర్‌ఆర్‌ నివేదిక, టారిఫ్‌ ప్రతిపాదనలు 2023–24తోపాటు ట్రూఅప్‌ చార్జీల ప్రతిపాదనలపై శుక్రవారం ఈఆర్‌సీ చైర్మన్‌ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ. మనోహర్‌రాజు, బండారు కృష్ణయ్య బహిరంగ విచారణ నిర్వహించగా టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి పాల్గొని వక్తలు లేవనెత్తిన అంశాలకు వివరణ ఇచ్చారు. 
ఎవరేమన్నారంటే... 

అసమర్థ విధానాలతోనే నష్టాలు... 
అసమర్థ ఆర్థిక నిర్వహణ, తొందరపాటు నిర్ణయాలతోనే డిస్కంలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. ఆ భారాన్ని ప్రజలు భరించాల్సి వస్తోంది. ఛత్తీస్‌గఢ్, సెమ్‌కాబ్‌ విద్యుత్‌ ఒప్పందాలపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. ధరల వివాదంతో ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ సరఫరా బంద్‌ కాగా, సెమ్‌కాబ్‌ విద్యుత్‌ ధర యూనిట్‌కు రూ. 8.33కి పెరిగింది. విద్యుత్‌ కేంద్రాల నిర్మాణ వ్యయాన్ని పెంచుకొనేందుకు వీలు కల్పిస్తూ ఈఆర్‌సీ జారీ చేసిన ‘రెగ్యులేషన్‌ 1 ఆఫ్‌ 2019’ను ఉపసంహరించుకోవాలి. విద్యుత్‌రంగం ప్రైవేటీకరణ కోసమే ప్రీపెయిడ్‌ మీటర్లను, ఆదానీ కోసమే ఎగుమతి చేసిన బొగ్గు వినియోగాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది.  – సెంటర్‌ ఫర్‌ పవర్‌ స్టడీస్‌ కన్వీనర్‌ ఎం.వేణుగోపాల్‌రావు 

అందరికీ విద్యుత్‌ చార్జీలు పెంచాలి
ప్రతి ఇంట్లో ఒక్కో వ్యక్తి నెలకు రూ. 300 చొప్పున సెల్‌ఫోన్‌ బిల్లుకు, లీటర్‌ పెట్రోల్‌కు రూ.100 చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన విద్యుత్‌ చార్జీలు ఎందుకు పెంచకూడదు? డిస్కంల నష్టాల నేపథ్యంలో రాష్ట్రంలో అందరికీ విద్యుత్‌ బిల్లులు పెంచాలి. కార్పొరేట్‌ బడులు, ఆస్పత్రులకు మరింత ఎక్కువగా పెంచాలి. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా అవసరం లేదు. విద్యుత్‌ టవర్ల కింద భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించట్లేదు. క్షేత్రస్థాయిలో లైన్‌మెన్‌ నుంచి ఏడీఈ వరకు అధికారులు రైతులపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. – బీజేపీ కిసాన్‌మోర్చా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి 

సబ్సిడీ సొమ్ము తీసుకున్నాకే డిస్కంలు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలి 
రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిస్కంలు ముందుగా సబ్సిడీ నిధులు తీసుకున్న తర్వాతే వ్యవసాయం, సెలూన్లు, లాండ్రీలు, ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు ఉచిత విద్యుత్‌ అందించాలి. నేను బతికుండగానే కొడంగల్‌ డివిజన్‌లోని మా హస్నాబాద్‌లో సబ్‌స్టేషన్‌ వస్తే సంతోషంగా చనిపోతా. లో వోల్టేజీ సమస్యతో ఆరేళ్ల నుంచి అడుగుతున్నా స్పందన లేదు.  – స్వామి జగన్మాయనంద 

ప్రైవేటు ఆస్పత్రులను ఎల్టీ–2 కమర్షియల్‌ కేటగిరీ నుంచి ప్రభుత్వ ఆస్పత్రులుండే ఎల్టీ–7 జనరల్‌ కేటగిరీకి మార్చాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తరఫున డాక్టర్‌ సంపత్‌ రావు విజ్ఞప్తి చేశారు.  ఐఐటీ హైదారాబాద్‌కు ప్రతి నెలా రూ.1.1 కోట్ల వరకు విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయని, హెచ్‌టీ–2 కేటగిరీ నుంచి కొత్త కేటగిరీకి మార్చాలని సంస్థ తరఫున సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ రవీంద్ర బాబు విజ్ఞప్తి చేశారు.  అదనంగా యూనిట్‌కు 66 పైసలు చెల్లించి కొనుగోలు చేస్తున్న గ్రీన్‌ ఎనర్జీకి సంబంధించిన సర్టిఫికెట్లను ప్రతినెలా జారీ చేయాలని ఇన్ఫోసిస్‌ విజ్ఞప్తి చేసింది.  ఏఆర్‌ఆర్, టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించకుండానే ట్రూఅప్‌ చార్జీల వసూళ్లకు డిస్కంలు అనుమతి కోరడంపై ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆప్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ అభ్యంతరం తెలిపింది. 

కరెంట్‌ ఫెన్సింగ్‌ పెట్టుకొనే వారిపై హత్యానేరం కేసులు: ఈఆర్సీ చైర్మన్‌  
పంట పొలాలకు ఏర్పాటు చేసిన విద్యుత్‌ ఫెన్సింగ్‌తో ఇటీవల రాష్ట్రంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. విద్యుత్‌తో ఫెన్సింగ్‌ వేసే వారిపై గతంలో అక్రమ కనెక్షన్‌ ఆరోపణలపై రెండేళ్లలోపు జైలుశిక్ష వర్తించే సెక్షన్‌ 304ఏ కింద కేసు పెట్టేవారు. కానీ ఇకపై హత్యానేరం కింద (సెక్షన్‌304) కేసులు నమోదు చేయాలని ఆదేశించాం. – ఈఆర్సీ చైర్మన్‌ శ్రీరంగారావు 
    

మరిన్ని వార్తలు