ఎల్‌ అండ్‌ టీ ససేమిరా! 

3 Mar, 2024 02:41 IST|Sakshi

ఈఆర్టీ నివేదిక కోసం ఇరిగేషన్‌ ఇంజనీర్ల విజ్ఞప్తులను పెడచెవిన పెడుతున్న ‘మేడిగడ్డ’నిర్మాణ సంస్థ 

జనవరిలోనే 7వ బ్లాక్‌కి ముగిసిన ఎలక్ట్రో రెసిస్టివిటీ టోమోగ్రఫీ పరీక్షలు  

గత నెల రెండో వారం నాటికే సిద్ధమైన నివేదిక?.. నివేదికివ్వాలని ఇరిగేషన్‌ శాఖకు సీఎంవో ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణాలు తెలుసుకునేందుకు నిర్వహించిన ఎలక్ట్రో రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్టీ) పరీక్షల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ చేస్తున్న విజ్ఞప్తులను నిర్మాణ సంస్థ ‘ఎల్‌ అండ్‌ టీ’బేఖాతరు చేస్తోంది. నివేదికను అధికారికంగా సమర్పించేందుకు నిరాకరిస్తోంది. గత రెండు వారాలుగా నీటిపారుదల ఇంజనీర్లు చేస్తున్న విజ్ఞప్తులను ఎల్‌ అండ్‌ టీ పట్టించుకోవడం లేదని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. కాగా ఈఆర్టీ నివేదికను తక్షణమే ప్రభుత్వానికి సమర్పించాలని ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా నీటిపారుదల శాఖను ఆదేశించింది. దీనిపై త్వరలోనే మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులను పిలిపించి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది.  

నెలరోజుల విశ్లేషణతో నివేదిక సిద్ధం! 
గతేడాది అక్టోబర్‌ 21న మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన 7వ బ్లాక్‌ కుంగిపోయిన విషయం తెలిసిందే. కాగా నిపుణులు బ్యారేజీని పరిశీలించి కుంగిపోవడానికి కారణమైన సాంకేతిక లోపాలను గుర్తించడానికి ఈఆర్టీ, గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌ (జీపీఆర్‌) వంటి జియోఫిజికల్, జియోలాజికల్‌ పరీక్షలు నిర్వహించాలని సిఫారసు చేశారు. ఈ పరీక్షల ద్వారా లోపాలు, అలాగే బ్యారేజీలోని అన్ని విభాగాల పటిష్టతను పరిశీలించిన తర్వాతే మరమ్మతులు, పునరుద్ధరణ, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

దీంతో నవీ ముంబైకి చెందిన ‘డైనసోర్‌ కాంక్రీట్‌ ట్రీట్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’అనే సంస్థ ఆధ్వర్యంలో 7వ బ్లాక్‌ ర్యాఫ్ట్‌ (పునాది)తో పాటు దాని దిగువన ఉన్న సెకెంట్‌ పైల్స్‌ (పునాది కింద స్తంభాలు) స్థితిగతులను తెలుసుకోవడానికి జనవరి 4 నుంచి 9 వరకు ఈఆర్టీ టెస్ట్‌ నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా వచ్చిన సమాచారాన్ని దాదాపు నెల రోజుల పాటు విశ్లేషించి గత నెల రెండో వారం నాటికి నివేదికను సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈఆర్టీ టెస్ట్‌ అంటే భూగర్భంలోని కాంక్రీట్‌ నిర్మాణాలను ‘ఎక్స్‌రే’తీసి ఆ చిత్రాలను విశ్లేషించడమేనని నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి.  

కొంప ముంచిన సెకెంట్‌ పైల్స్‌ లోపాలు? 
వాస్తవానికి శాఖలోని కొందరు కీలక అధికారులకు అనధికారికంగా ముసాయిదా ఈఆర్టీ నివేదిక అందింది. నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ అధికారికంగా ఇవ్వనందున రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించలేదని సమాచారం. కాగా నిర్మాణ లోపంతో సెకెంట్‌ పైల్స్‌ మధ్య ఏర్పడిన ఖాళీలతోనే బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి భారీ బుంగ ఏర్పడి 7వ బ్లాక్‌ కుంగినట్టుగా నిర్థారణకు వచ్చారనే చర్చ జరుగుతోంది. భూగర్భంలో సెకెంట్‌ పైల్స్‌ను నిటారుగా ఏర్పాటు చేయాల్సి ఉండగా, వక్రంగా పాతిపెట్టడంతో వాటి జాయింట్ల వద్ద ఖాళీలు ఏర్పడినట్లు కొందరు అధికారులు తెలిపారు. 

ఇతర బ్లాకులకు ఆగిన టెస్టులు 
మేడిగడ్డ బ్యారేజీకి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని దారి మళ్లించడం కోసం కాఫర్‌ డ్యామ్‌ నిర్మిస్తున్నారు. దీని ద్వారా బ్యారేజీలోని 6, 7, 8 బ్లాకులకు వరద ప్రవాహం చేరకుండా ఏర్పాట్లు చేశారు. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం కొలిక్కి వచ్చాక బ్యారేజీలోని 1–8 బ్లాకులకు ఈఆర్టీ, జీపీఆర్‌ టెస్టులు నిర్వహించేందుకు ఎల్‌ అండ్‌ టీ కసరత్తు చేసింది. జీపీఆర్‌ టెస్ట్‌ల నిర్వహణను న్యూఢిల్లీలోని పార్సన్‌ ఓవర్సీస్‌కు అప్పగించింది. అయితే ఎగువన ఉన్న అన్నారం బ్యారేజీకి మళ్లీ బుంగలు ఏర్పడడంతో బ్యారేజీని ఖాళీ చేసేందుకు కిందికి నీటిని విడుదల చేశారు.

20 వేల క్యూసెక్కుల వరద రావడంతో మేడిగడ్డ కాఫర్‌ డ్యామ్‌తో పాటు 6, 7, 8 బ్లాకుల పునాదుల వద్దకు భారీగా నీళ్లు వచ్చి చేరాయి. తమకు చెప్పకుండా వరదను విడుదల చేయడంతో 15 రోజుల పాటు చేసిన పనులు వృధా అయ్యాయని ఎల్‌ అండ్‌ టీ ఆరోపించింది. టెస్టులను ప్రస్తుతానికి నిలిపి వేశామని, దీనికి తాము బాధ్యులం కామని పేర్కొంటూ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. మరోవైపు తాము సొంత డబ్బులతో ఎలాంటి పనులూ చేపట్టబోమని సంస్థ పలు లేఖల ద్వారా స్పష్టం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ఒప్పందం చేసుకోవాలని అంటోంది. అలాగే బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పెండింగ్‌ పనులు పూర్తయ్యాయని ధ్రువీకరిస్తూ సర్టీఫికెట్‌ జారీ చేయాలని, చివరి బిల్లుతో పాటు డిపాజిట్లు కలిపి మొత్తం రూ.456.07 కోట్లు విడుదల చేయాలని కూడా కోరుతూ మరో లేఖ రాసింది.

whatsapp channel

మరిన్ని వార్తలు