ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌: అడవిపై ఈ–కన్ను.. ఎక్కడి నుంచైనా లైవ్‌లో వీక్షించే అవకాశం

23 Jan, 2023 01:21 IST|Sakshi

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో ఎలక్ట్రానిక్‌–ఐ నిఘా వ్యవస్థ 

పులులు, ఇతర వన్యప్రాణుల ప్రతి కదలిక పక్కాగా, స్పష్టంగా రికార్డ్‌ 

కీలక ప్రదేశాల్లో 10 అత్యాధునిక కెమెరాలతో పర్యవేక్షణ 

ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ లేనిచోట్ల రేడియో ఫ్రీక్వెన్సీతో 24 గంటల సర్వైలైన్స్‌ 

పగటి వేళ చెరువులో కొంతసేపు జలకాలాటలు ఆడిన ఓ పెద్దపులి, ఆ తర్వాత ఒడ్డునే ఉన్న ఓ చెట్టుకు శరీరం, తల రుద్దుకుంటూ సేదతీరింది. 
ఓ నీటిగుంటలో ఒక సాంబార్‌ జింక నిద్రిస్తుండగా అడవి కుక్కలు దాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేశాయి. క్షణాల్లోనే అప్రమత్తమైన ఆ జింక వేగంగా తప్పించుకోవడంతో అడవి కుక్కలు నిరాశగా వెళ్లిపోయాయి. 

ఒకచోట రెండు, మూడు పులులు తమ పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఫుల్లుగా ఎంజాయ్‌ చేశాయి. 
ఎఫ్‌–6 (పులి) రాత్రి వేళ స్వేచ్ఛగా సంచరించడం స్పష్టంగా కన్పించింది. 

కొన్ని జంతువులు ఇతర జంతు­వులపై దాడికి దిగి, ఆకలి తీరాక పక్క నుంచి బలహీనమైన ఇతర వన్యప్రాణులు వెళుతున్నా పట్టించుకోలేదు. 
ఇలాంటి అనేక వీడియోలు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో కెమెరాల్లో రికార్డయ్యాయి. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2,611 చ.కి.మీ పరిధిలో విస్తరించి పెద్దపులుల అభయారణ్యంగా పేరుగాంచిన ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌)లో పటిష్ట పరిచిన ఎల్‌క్ట్రానిక్‌–ఐ (ఈ–కన్ను) నిఘా వ్యవస్థ సత్ఫలితాలనిస్తోంది. పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల కదలికలు తెలుసుకునేందుకు, వాటి సంరక్షణకు.. అటవీ ఆక్రమణలు, జంతువుల వేట, కలప స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు బాగా ఉపయోగపడుతోంది.

ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానా­న్ని కొంతకాలం క్రితమే ప్రయోగాత్మకంగా ఏటీఆర్‌లో అధికారులు ప్రారంభించారు. ప్రస్తుతానికి పది కెమెరాలను వినియోగంలోకి తీసుకురాగా.. పులులు, ఇతర జంతువులకు సంబంధించి వచ్చిన లైవ్‌ వీడియోలు, ఫొటోలు అబ్బురపరిచే విధంగా ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. 

ఎక్కడినుంచైనా పర్యవేక్షణ 
క్షేత్రస్థాయిలో పెద్దసంఖ్యలో అటవీ సిబ్బందిని నియమించాల్సిన అవసరం లేకుండా, కీలకమైన, క్లిష్టమైన ప్రదేశాల్లో వారానికి ఏడు రోజులు 24 గంటల పాటు (24/7) కచ్చితత్వంతో అటవీ ప్రాంతాన్ని పర్యవేక్షించేందుకు దీని ద్వారా వీలు కలిగింది. సాఫ్ట్‌వేర్‌ ఆధారిత వ్యవస్థ ద్వారా పనిచేసే ఈ విధానంలో... వివిధ సెన్సిటివ్‌ జోన్లలో హై రెజ­ల్యూషన్‌ థర్మల్, ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాల ద్వారా మనుషులు, పులుల కదలికలను రికార్డ్‌ చేశారు. ఉన్నతా«­దికారుల సెల్‌ఫోన్‌కు జంతువుల కదలికలు, ఇతర ఘటనలకు సంబంధించిన అలర్ట్‌లు, నోటిఫికేషన్లు వచ్చే సాంకేతికతను ఏర్పాటు చేశారు. 

రేడియో ఫ్రీక్వెన్సీతో ఇంటర్నెట్‌ అనుసంధానం 
అడవిలో ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ కవర్‌ కాని చోట్ల రేడియో ఫ్రీక్వెన్సీతో 360 డిగ్రీల పరిధిలో 24 గంటల సర్వైలెన్స్‌ ద్వారా పులులు, వన్యప్రాణుల కదలికల్ని గమనిస్తూ పర్యవేక్షించగలుగుతున్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ నెట్‌వర్క్‌ నుంచి ఇంటర్నెట్‌కు దృశ్యాలు కన్వర్టయ్యే స్ట్రీమింగ్‌తో ఎక్కడి నుంచైనా లైవ్‌లో మానిటర్‌ చేసే అవకాశాలుండడం అధికారులకు ఉపకరిస్తోంది. అడవుల్లో మొబైల్‌ టవర్లు నెలకొల్పలేని మారుమూల అటవీ ప్రాంతాల్లో, సిగ్నల్స్‌ లేనిచోట రేడియో వేవ్‌ కమ్యూనికేషన్‌ ద్వారా...ఇంటర్నెట్‌ ఓవర్‌ రేడియా (ఐవోఆర్‌ఏ) విధానం ద్వారా వాకీటాకీలు పనిచేసేలా వ్యవస్థను రూపొందించారు. 

ఐటీ శాఖతో చర్చలు 
ఫారెస్ట్‌ కోడ్‌ ప్రకారం బీట్‌ ఆఫీసర్లు నెలలో 26 రోజుల పాటు రాత్రి వేళ అడవిలో తిరగాలి. టేకు చెట్లను కొట్టినా, అడవి నరికినా వాటిని వారు గుర్తించిపై అధికారులను అలర్ట్‌ చేయాలి. ప్రస్తుతం ఈ–ఐ ఏర్పాటుతో వీరి పని సులభంగా మారింది. ప్రస్తుతం ఏటీఆర్‌లో ఈ వ్యవస్థను మరింత విస్తృతం చేసే ఆలోచనతో అధికారులున్నారు. పైలెట్‌ ప్రాజెక్ట్‌ స్థాయిలో చేసేందుకు తెలంగాణ ఐటీశాఖతో ఏటీఆర్‌ అధికారులు చర్చలు జరిపినట్టు సమాచారం.

ప్రస్తుతం పది కెమెరాలతోఏర్పాటు చేసిన విధానం వల్ల  పరిమితంగానే అడవి కవర్‌ అవుతోంది. దీనిని మరింత విస్తృత పరచడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వంద నుంచి రెండువందల దాకా కెమెరాలు ఏర్పాటు చేస్తే బావుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కో వాచ్‌ టవర్‌కు అడ్వాన్స్‌డ్‌ కెమెరా కోసం రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు, కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ కోసం రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఏటీఆర్‌కు దాదాపు వంద ఎంట్రీ పాయింట్లు ఉన్నందున, రెండువందల కీలక ప్రదేశాల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తే దేశంలోనే పటిష్టమైన నిఘా వ్యవస్థ కలిగిన టైగర్‌ రిజర్వ్‌గా దీనిని తీర్చిదిద్దవచ్చునని చెబుతున్నారు. 

అడవిలో కదలికలన్నీ తెలిసిపోతున్నాయ్‌.. 
వన్యప్రాణుల సంరక్షణకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ–ఐ కెమెరాలతో అడవిలో ఏం జరుగుతోందో తెలిసిపోతోంది. జంతువుల కదలికలను స్పష్టంగా చూడగలుగుతున్నాం. లోతైన లోయలు, కొన్ని ఇతర ప్రాంతాల్లో పర్యవేక్షణ చాలా కష్టంగా ఉంటుంది. వాకీటాకీలు పనిచేయని పరిస్థితులుంటాయి. ఇంటర్నెట్‌ ఓవర్‌ రేడియో విధానం ద్వారా మొబైల్‌ సిగ్నల్స్‌ లేకపోయినా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది.  
– రోహిత్‌ గొప్పిడి, డీఎఫ్‌వో, నాగర్‌కర్నూల్‌  జిల్లా   

మరిన్ని వార్తలు