నా బదిలీ వెనుక మంత్రి సత్యవతి కుట్ర 

17 Feb, 2021 08:15 IST|Sakshi

కన్నీరుమున్నీరైన డాక్టర్‌ భీంసాగర్‌

సాక్షి, మహబూబాబాద్‌: పదవీ విరమణకు 16 నెలల సమయమే ఉన్నప్పటికీ తనను అకారణంగా బదిలీ చేశారని, ఇందుకు మంత్రి సత్యవతి రాథోడే కారణమని డాక్టర్‌ ఎస్‌.భీంసాగర్‌ ఆరోపించారు. మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న ఆయనను తాజాగా హైదరాబాద్‌ లోని టీవీవీపీ రాష్ట్ర జాయింట్‌ కమిషనర్‌ కార్యాలయంలో రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్‌గా బదిలీ చేశారు.

మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన కన్నీరు మున్నీరయ్యారు. మంత్రి బంధువుకు సూపరింటెండెంట్‌ పదవి కట్టబెట్టేందుకే తనను బదిలీ చేయించారని పేర్కొన్నా రు. మంత్రి కుమారుడు, ఛాతీ వైద్య నిపుణుడు సతీష్‌ రాథోడ్‌ నెలలో వారం రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నారని, అయినప్పటికీ పూర్తి జీతం ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. అలా ఇవ్వకపోవడంతోనే తనను లక్ష్యంగా చేసుకుని బదిలీ చేయించారన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు పదోన్నతి ఇవ్వకపోగా, కేవలం డిప్యుటేషన్‌పై బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు.

పని హైదరాబాద్‌లో చేస్తూ వేతనం మహబూబాబాద్‌లో తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధమేనన్నారు. కాగా, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భూక్యా వెంకట్రాములు మాట్లాడుతూ, భీంసాగర్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నారని, మంత్రి సత్యవతి, ఆమె కుమారుడు డాక్టర్‌ సతీ‹Ùతో పాటు తనపై వ్యతిరేక ప్రచారం చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు