కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగుల నిరసన 

2 Sep, 2020 09:41 IST|Sakshi
కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతున్న ఉద్యోగుల ఐక్య వేదిక నాయకులు

సాక్షి, ఆదిలాబాద్‌: కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగుల ఐక్యవేదిక నాయకులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్, పబ్లిక్‌ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 1న పెన్షన్‌ విద్రోహ దినంగా పాటిస్తూ కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఆర్సీ, పదోన్నతులు, బదిలీలు తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఫైన్డ్‌ పెన్షన్‌ స్థానంలో సీపీఎస్‌ను పార్లమెంట్‌ ఆమోదం లేకుండా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారా ప్రవేశపెట్టిందన్నారు. 2004 సెప్టెంబర్‌ 1 తర్వాత నియామకమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం రద్దు చేసి నూతన పెన్షన్‌ విధానాన్ని అమలు పరుస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణలో పాత పెన్షన్‌ విధానం అమలు చేసే అవకాశమున్నా.. ఏకపక్షంగా సీపీఎస్‌నే అమలు చేస్తామంటూ పీఎఫ్‌ఆర్డీఏతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈ పథకంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు రిటైర్డ్‌ అయినా.. చనిపోయినా.. వారి కుటుంబాలకు నెలకు రూ.2 వేల కంటే తక్కువ మొత్తంలో పింఛన్‌ అందుతుందన్నారు. ఉద్యోగులకు నష్టం కలిగించే విధంగా ఉన్న సీపీఎస్‌ను రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగుల ఐక్యవేదిక నాయకులు వెంకట్, శ్రీనివాస్, నరేందర్, అశోక్, దిలీప్, సురేఖ, వెంకటేశ్, స్వామి, మనోజ్, వృకోధర్, తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు