డీఎస్‌ఎస్‌ ఆధారంగా ‘కాళేశ్వరం’ నిర్వహణ

5 Nov, 2020 03:19 IST|Sakshi

పంప్‌హౌస్‌లు, జలాశయాలు, కాలువల నిర్వహణ సులభం 

వ్యవస్థ ఏర్పాటుకు వాసర్‌ ల్యాబ్స్‌తో ఒప్పందం  

ఈఎన్‌సీ మురళీధర్‌ వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో పంప్‌హౌస్‌లు, జలాశయాలు, కాలువలను సమర్థవంతంగా నిర్వహించడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడానికి ప్రభుత్వం సంకల్పించిందని ఈఎన్‌సీ మురళీధర్‌ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డెసిషన్‌ సపోర్టు సిస్టం (డీఎస్‌ఎస్‌)పై బుధవారం జలసౌధలో ఒక రోజు వర్క్‌షాప్‌ను ప్రారంభిస్తూ ప్రాజెక్టు నిర్వహణ కోసం సమగ్ర సమాచారం ఈ సపోర్ట్‌ సిస్టమ్‌లో అందుబాటులో ఉం టుందని, ఆ సమాచారం ఆధారంగా పంప్‌హౌస్‌లు, జలాశయాలు, కాలువల నిర్వహణ సాధ్యం అవుతుందని తెలిపారు. జలాశయాల్లో ఎంత నీరు ఉన్నది, ఆయకట్టుకు ఎంతనీరు అవసరం, భూగర్భ జలాల పరిస్థితి, వర్షపాతం, నదుల ద్వారా ఎంత పరిమాణంలో నీరు వస్తోంది.. తదితర సమస్త సమాచారం ఈ సిస్టమ్‌ ద్వారా అందుబాటు లోకి రానుందని వివరించారు.

ఈ అత్యాధునిక వ్యవస్థను తయారు చేయడానికి వాసర్‌ ల్యాబ్స్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. ఈ సిస్టమ్‌కు అవసరమయ్యే సాఫ్ట్‌వేర్‌లను, మొబైల్‌యాప్‌ లను తయారు చేయడంతోపాటు ఐదేళ్లు వారే నిర్వహిస్తారని, సాగునీటి శాఖ ఇంజనీర్లకు ఈ సాఫ్ట్‌వేర్‌ నిర్వహణ, వినియోగంపై శిక్షణ కూడా ఇస్తారని ఈఎన్‌సీ పేర్కొన్నారు. బుధవారం నుంచి మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారని, ఈ సిస్టమ్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వినియోగంలో ఉందని  వెల్లడించారు. ఈ వ్యవస్థ కాళేశ్వరం లాంటి అతి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఇంజనీర్లకు ఎంతో తోడ్పాటునందిస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్‌ తన కార్యాలయం నుంచే ఈ సపోర్ట్‌ సిస్టమ్‌ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి, ఇంజనీర్లకు సూచనలు, ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం ఉందని తెలిపారు.

మరిన్ని వార్తలు