ఆలయాల అభివృద్ధి...భక్తులపైనే భారం

20 Jan, 2021 17:24 IST|Sakshi

దేవాదాయశాఖ నిర్ణయం... ఇప్పటికే రూ.28 కోట్ల సమీకరణ

ఈ సంవత్సరం మొత్తం రూ.50 కోట్లు సేకరించాలని నిర్ణయం

ఆలయాలవారీగా బడా భక్తులతో సమావేశాలు

సాక్షి, హైదరాబాద్‌ : నిత్య పూజలు.. పండుగ ఉత్సవాలు.. బ్రహ్మోత్సవాలు, ఇతర వేడుకలు, నిర్వహణ పనులు, భక్తుల వసతికి అభివృద్ధి పనులు.. ప్రతి దేవాలయంలో భారీగా వ్యయం అవుతుంది. కానీ రాష్ట్రంలో కొన్ని దేవాలయాలకు మంచి ఆదాయం ఉండగా, మిగతా దేవాలయాలకు అంతంత మాత్రమే ఆదాయం ఉంది. సర్వశ్రేయోనిధి లాంటి వాటికి దేవాలయాల నుంచి నిర్ధారిత మొత్తం చెల్లించాల్సి ఉండగా, వాటికి మాత్రం ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులంటూ ఉండవు. భక్తుల నుంచి, ఇతర కైంకర్యాల రూపంలో వచ్చే కానుకలు, విరాళాలే ప్రధాన ఆదాయ వనరు. ఫలితంగా చాలా దేవాలయాల్లో ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉంది. ఇది ఆయా దేవాలయాల అభివృద్ధికి విఘాతంగా మారింది. నిత్యం వచ్చే భక్తులు, ప్రత్యేక కార్యక్రమాలకు వచ్చే వారికి సరైన వసతులు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో దేవాదాయ శాఖ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఆయా ఆలయాలకు వచ్చే భక్తుల్లో ఆర్థికంగా స్థితిమంతుల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించింది. వారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ, ఆలయ పరిస్థితిని వివరించి తోచినంత విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతోంది. 

ఆయన మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో కాంట్రాక్టు పనులు నిర్వహిస్తుంటారు. కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయానికి పరమభక్తుడు. ఇప్పుడు ఆయన అక్కడ రూ.4 కోట్లతో కళ్యాణమండపం, భక్తుల వసతి గృహాలు, ఇతర సౌకర్యాలు సమకూరుస్తున్నారు. ఇలా కాళేశ్వరంలో ఓ భక్తుడు రూ.కోటిన్నరతో వసతి గృహం, మరో భక్తుడు రూ.50 లక్షలతో ఆలయానికి వెండి తాపడం చేయిస్తున్నారు. కర్మన్‌ఘాట్‌ అభయాంజనేయస్వామి ఆలయంలో ఇద్దరు భక్తులు రూ.కోటిన్నరతో పనులు నిర్వహిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇవన్నీ దేవాదాయశాఖ విన్నపంతో ముందుకొచ్చిన దాతలు చేయిస్తున్న పనులే. ఈ సంవత్సరం రూ.50 కోట్లు విరాళాల రూపంలో నిధులు సమకూర్చి అభివృద్ధి పనులు నిర్వహించాలని నిర్ణయించిన దేవాదాయశాఖ, ఆయా జిల్లాల సహాయ కమిషనర్లు, దేవాలయాల ఈవోలను ఇందుకు పురమాయించింది.

దీంతో దేవాలయాల ఆధ్వర్యంలో స్థానిక వర్తక సంఘాలు, ఫెడరేషన్లు, కాంట్రాక్టు సంస్థలు, ఇతరులతో సమావేశాలు నిర్వహించి దేవాదాయశాఖ ప్రతిపాదనను వారి ముందుంచారు.ఆలయాల ప్రాశస్త్యం వివరించి, ప్రతి సంవత్సరం దేవాలయ నిర్వహణకు అవుతున్న వ్యయం, వస్తున్న ఆదాయం లెక్కలు వారి ముందుంచి, కొత్తగా అవసరమైన పనులు, వాటికి అయ్యే అంచనా వ్యయం వివరాలను వెల్లడించారు. దీంతో పలువురు విరాళాలు అందజేసేందుకు ముందుకొచ్చారు. అలా గత రెండు నెలల కాలంలో ఏకంగా రూ.28 కోట్లకు అంగీకారం వచ్చింది. ఈ ఉత్సాహంతో రాష్ట్రస్థాయిలో మరో భారీ సమావేశాన్ని నిర్వహించి బడా భక్తులను ఆలయాల అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. త్వరలో ఆ సమావేశం జరగనుంది. అది పూర్తయ్యాక లక్ష్యంగా నిర్ధారించుకున్న రూ.50 కోట్లను మించి విరాళాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. 

డబ్బు తీసుకోకుండా వారి ఆధ్వర్యంలోనే పనులు
దేవుడికి వచ్చే విరాళాలను స్వాహా చేసిన ఘనులు దేవాదాయ శాఖలో ఎందరో. ఇప్పుడు ఈ విరాళాలు కూడా దుర్వినియోగం అయితే దేవాదాయశాఖకు మరింత చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో, దాతల నుంచి నిధులు వసూలు చేయవద్దని కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ఆదేశించారు. విరాళాలు ప్రకటించిన తర్వాత వారి ఆధ్వర్యంలోనే పనులు నిర్వహించి నేరుగా వారే ఖర్చును భరించేలా చూస్తున్నారు. విరాళాలకు సంబంధించి చురుగ్గా వ్యవహరించిన వారు, ఎక్కువ విరాళాలను సేకరించిన అధికారులు, సిబ్బందిని గుర్తించి ప్రభుత్వం నుంచి పురస్కారం ఇప్పించాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. తొలి విడతగా వచ్చే గణతంత్ర దినోత్సవం రోజున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రోత్సాహకాలను అందించనున్నారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు