కరీంనగర్‌ గ్రానైట్‌ కంపెనీలపై ఈడీ నజర్‌!

5 Aug, 2021 02:40 IST|Sakshi

ఎగుమతుల్లో అక్రమాలకు పాల్పడ్డారని తొమ్మిది సంస్థలపై ఆరోపణలు 

2013లో ఉల్లంఘనలపై రూ.749.66 కోట్లు జరిమానా విధించిన మైనింగ్‌ శాఖ 

తెలంగాణ వచ్చాక ఆ జరిమానాను రూ.124 కోట్లకు తగ్గించుకున్న కంపెనీలు 

కరీంనగర్‌ న్యాయవాది లేఖతో రంగంలోకి దిగిన ఈడీ 

కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల మీదుగా చేసిన గ్రానైట్‌ ఎగుమతులపై ఆరా

సాక్షి, హైదరాబాద్‌: కరీంనగర్‌లో గ్రానైట్‌ దందాపై ఈడీ దృష్టి సారించింది. మైనింగ్‌ పరిమితులు దాటి మరీ గ్రానైట్‌ను విదేశాలకు ఎగుమతి చేశారని, చెల్లించాల్సిన జరిమానాలను కూడా ఎగ్గొడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆయా అక్రమాలపై ఆరా తీస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గ్రానైట్‌ వ్యాపారం చేస్తున్న పలు కంపెనీలు తీవ్రస్థాయిలో ఉల్లంఘనలకు పాల్పడ్డాయని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన జరిమానాలు కట్టడం లేదని కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భేతి మహేందర్‌రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించిన ఈడీ.. సదరు కంపెనీలు చేసిన ఎగుమతులపై ‘ఫారిన్‌ ఎక్సే్ఛంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (ఫెమా)–1999’కింద విచారణ చేపట్టింది. 

ఇంతకీ ఏం జరిగింది? 
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గ్రానైట్‌ వ్యాపారం చేస్తున్న కొన్ని కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి రూ.124.94 కోట్ల నష్టం వాటిల్లిందని కరీంనగర్‌ న్యాయవాది భేతి మహేందర్‌రెడ్డి ఈ ఏడాది జూలై 8న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి లేఖ రాశారు. సదరు లేఖ, రాష్ట్ర మైనింగ్‌ శాఖ వివరాల ప్రకారం.. రాష్ట్రం లో మొత్తం 17 చోట్ల భారీగా మైనింగ్‌ జరుగుతోంది. ప్రధానంగా గ్రానైట్‌ ఎగుమతుల్లో ముందంజ లో ఉన్న కరీంనగర్‌లో ఒద్యారం (మల్టీకలర్‌), మానకొండూరు(మేపిల్‌ కలర్‌), సుల్తానాబాద్‌ (కాఫీ బ్రౌన్‌), ములంగూరు–హుజూరాబాద్‌ (రెడ్‌ రోజ్‌), కత్వాల (బ్లూబ్రౌన్‌)లలో మైనింగ్‌ నడుస్తోం ది. వీటిని శ్వేత ఏజెన్సీస్, శ్వేత గ్రానైట్స్, ఏఎస్‌ షిప్పింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, జేఎం బక్సీ అండ్‌ కంపెనీ, మైథిలీ ఆదిత్య ట్రాన్స్‌పోర్ట్, కేవీకే ఎనర్జీ, అరవింద్‌ గ్రానైట్స్, సంధ్య ఏజెన్సీస్‌ సంస్థలు నిర్వ హిస్తున్నాయి. ఇవి ఏళ్ల తరబడి నిబంధనలు ఉల్లంఘిస్తూ భారీగా లబ్ధి పొందాయని ఆరోపణలు రావడంతో ఉమ్మడి రాష్ట్రంలోనే విజిలెన్స్‌ దాడులు జరి గాయి. నిర్దేశించిన పరిమాణాన్ని మించి ఉన్న గ్రానై ట్‌ బ్లాక్‌లను విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు అధి కారులు గుర్తించారు. పూర్తిస్థాయి విచారణ జరిపి ఏ సంస్థ వల్ల ఎంత నష్టం జరిగిందో లెక్కించారు. 

ఉల్లంఘనులకు జరిమానా విధించినా.. 
శ్వేత ఏజెన్సీస్‌ నుంచి రూ.4,19,49,318 నష్టం, శ్వేత గ్రానైట్స్‌ రూ.57,77,75,250, ఏఎస్‌ షిప్పింగ్‌ రూ.6,64,12,011, జేఎం బక్సీ కంపెనీ రూ.19,32,95,375, మైథిలీ ఆదిత్య రూ.33,65,83,000, కేవీకే ఎనర్జీ రూ.92,38,653, అరవింద్‌ ఏజెన్సీస్‌ రూ.94,86,290, సంధ్య ఏజెన్సీస్‌తో రూ.1,46,99,750.. కలిపి మొత్తంగా రూ.124,94,46,147 నష్టం వచ్చినట్టుగా విజిలెన్స్‌ అధికారులు తేల్చారు. ఈ మేరకు 2013లో అప్పటి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ అధికారులు.. ఆయా కంపెనీలు పాల్పడిన అక్రమాలకు ఐదు రెట్లు పెనాల్టీ కలిపి  రూ.749.66,76,882 జరిమానా (సినరేజీ ఫీజు) విధించారు. కానీ ఆ కంపెనీలు జరిమానా చెల్లించకుండా.. వ్యాపారాన్ని యధేచ్ఛగా కొనసాగిస్తూ వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆయా కంపెనీల యజమానులు రాజకీయ పలుకుబడితో ఒత్తిడి తెచ్చి.. ఐదు రెట్ల పెనాల్టీని తగ్గించుకుని ఒక వంతుకు (మెమో నం.6665/ఆర్‌1/2016) తగ్గించుకున్నారు. ఈ మొత్తాన్ని కూడా సరిగా చెల్లించలేదు. కేవలం రూ.11 కోట్ల వరకు మాత్రమే చెల్లించారు. న్యాయ వాది మహేందర్‌రెడ్డి ఈ అంశాలన్నీ వివరిస్తూ ఈడీకి ఫిర్యాదు చేశారు. సదరు కంపెనీలు ఎగవేసిన పెనాల్టీలను తిరిగి వసూలు చేయాలని కోరా రు. ఆయా కంపెనీల బ్యాంకు ఖాతాలు, పద్దుల నిర్వహణపై ప్రత్యేకంగా ఆడిటింగ్‌ చేస్తే మరిన్ని ఎగవేతలు, అక్రమాలు, భారీగా నల్లధనం వెలుగు లోకి వస్తాయని వివరించారు. వెంటనే ఆ సంస్థల బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేయాలని కోరారు.

విచారణ షురూ! 
న్యాయవాది భేతి మహేందర్‌రెడ్డితోపాటు పలువురు రాజకీయ నాయకులు కూడా గ్రానైట్‌ అక్రమాల వ్యవహారంపై ఈడీకి వేర్వేరుగా లేఖలు రాశారు. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. కరీంనగర్‌ నుంచి విదేశాలకు ఎగుమతి చేసిన గ్రానైట్‌ విషయంగా విచారణ మొదలుపెట్టింది. కరీంనగర్‌లో ఉత్పత్తి అయిన ఈ గ్రానైట్‌ను ఏపీలోని కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించి.. సదరు షిప్పింగ్‌ కంపెనీ ‘ఎలైట్‌ షిప్పింగ్‌ ఏజెన్సీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’కు లేఖ రాసింది. శ్వేత ఏజెన్సీస్, ఏఎస్‌ షిప్పింగ్, జేఎం బక్సీ అండ్‌ కంపెనీ, మైథిలీ ఆదిత్య ట్రాన్స్‌పోర్ట్, కేవీకే ఎనర్జీ, అరవింద్‌ గ్రానైట్స్, సంధ్య ఏజెన్సీస్, పీఎస్‌ఆర్‌ ఏజెన్సీస్, శ్రీవెంకటేశ్వర గ్రానైట్స్‌/ వెంకటేశ్వర లాజిస్టిక్స్‌ కంపెనీలు.. కరీంనగర్‌ నుంచి కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా ఎంతమేర గ్రానైట్‌ విదేశాలకు తరలించారు? కంపెనీల వివరాలు, యజమానులు/ భాగస్వాముల వివరాలు, ఈమెయిల్‌ ఐడీలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ కంపెనీలకు సంబంధించి ఇతర ఏ డాక్యుమెంట్లు ఉన్నా 10 రోజుల్లోగా పంపాలని కోరింది.  


గ్రానైట్‌ కంపెనీలకు ఈడీ జారీ చేసిన నోటీసు  

మరిన్ని వార్తలు