ఢిల్లీ లిక్కర్‌ స్కాం.. హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

7 Sep, 2022 02:19 IST|Sakshi

మద్యం కుంభకోణంలో 14వ నిందితుడిగా అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై

టెండర్ల వ్యవహారంలో పిళ్లై రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు లంచాలు ఇచ్చినట్టు ఆరోపిస్తున్న సీబీఐ

ఇతర డైరెక్టర్లు అభిషేక్, ప్రేమ్‌సాగర్‌ పాత్రపైనా ఈడీ ఆరా

కీలక పత్రాలు, బ్యాంకు స్టేట్‌మెంట్లు స్వాధీనం.. దేశవ్యాప్తంగా 30 చోట్ల కొనసాగిన తనిఖీలు 

సాక్షి, హైదరాబాద్‌:  ఢిల్లీ లిక్కర్‌ స్కాంకు సంబంధించి ఆరోపణలెదుర్కొంటున్న హైదరాబాద్‌కు చెందిన రాబిన్‌ డిస్టిలరీస్‌ డైరెక్టర్లు అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై, బోయినపల్లి అభిషేక్‌ రావు, గండ్ర ప్రేమ్‌ సాగర్‌ నివాసాలు, కార్యాలయాల్లో ఢిల్లీకి చెందిన ఈడీ బృందాలు మంగళవారం సోదాలు నిర్వహించాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకు సాగిన ఈ సోదాలు రాష్ట్రంలో సంచలనం రేపడంతో పాటు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రముఖుల పాత్ర ఉందంటూ బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈడీ సోదాలు చర్చనీయాంశమవుతున్నాయి.

ఇదీ లిక్కర్‌ స్కామ్‌..
నిబంధనలకు విరుద్ధంగా ఎక్సైజ్‌ పాలసీ రూపొందించి, పథకం ప్రకారం కొంత మందికి టెండర్లు కట్టబెట్టారన్న ఆరోపణలపై సీబీఐ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాతో పాటు మరో 15 మందిని నిందితులుగా చేర్చి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సిసోడియాతో పాటు ఎక్సైజ్‌ అధికారులకు లంచాలు ఇచ్చి కొందరు లిక్కర్‌ టెండర్లు దక్కించుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన రామచంద్ర పిళ్‌లైని కూడా సీబీఐ 14వ నిందితుడిగా చేర్చింది. 

లంచం నగదుపై ఆరా.. 
సీబీఐ కేసు నేపథ్యంలో రంగంలోకి దిగిన ఈడీ బృందాలు.. ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, హరియాణా, యూపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని సుమరు 30 ప్రాంతాల్లోని ప్రైవేట్‌ వ్యక్తుల నివాసాల్లో మంగళవారం దాడులు నిర్వహించాయి. హైదరాబాద్‌ కోకాపేటలో (ఈడెన్‌ గ్రీన్‌ గేటెడ్‌ కమ్యూనిటీ విల్లా నం.16) ఉన్న అరుణ్‌ రామచంద్ర పిళ్‌లై నివాసం, సికింద్రాబాద్‌లోని రాబిన్‌ డిస్టిలరీస్‌ కార్యాలయం, నార్సింగిలోని అభిషేక్‌రావు, ప్రేమ్‌సాగర్‌ నివాసాల్లో ఐదు బృందాలు సోదాలు జరిపాయి. ఎక్సైజ్‌ టెండర్ల వ్యవహారంలో పిళ్లై రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు లంచాలు ఇచ్చినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నగదు ఎక్కడిది? ఏ ఖాతా నుంచి వచ్చిందో ఈడీ కూపీ లాగుతోంది. రాబిన్‌ డిస్టిలరీస్‌కు సంబంధించిన మొత్తం లావాదేవీలతో పాటు లిక్కర్‌ టెండర్ల కోసం సాగిన చీకటి నగదు లావాదేవీలు లక్ష్యంగా ఈడీ సోదాలు సాగించినట్టు తెలిసింది. 

ఈ ఏడాది ఏప్రిల్‌లోనే...
రాబిన్‌ డిస్టిలరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌..అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్‌లై, గండ్ర ప్రేమ్‌ సాగర్‌ డైరెక్టర్లుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో 22న ప్రారంభమయ్యింది. 2022 జూలై 12న బోయినిపల్లి అభిషేక్‌ డిజిగ్నేటెడ్‌ పార్ట్‌నర్‌గా చేరారు. కంపెనీ పెట్టి కేవలం నాలుగు నెలలవుతుండగా కోట్ల రూపాయల లంచాలు చెల్లించి టెండర్లు దక్కించుకునేందుకు ప్రయత్నించడం దర్యాప్తు సంస్థలు దీనిపై దృష్టి పెట్టేలా చేసింది. రామచంద్రన్‌ పిళ్లైతో పాటు మిగతా డైరెక్టర్ల ప్రమేయాన్ని తేల్చేక్రమంలో ఈడీ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. కంపెనీ ఏర్పాటు, పెట్టుబడి వ్యవహారాలు, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో పాత్రకు సంబంధించిన కీలక పత్రాలను, లావాదేవీలకు సంబంధించి బ్యాంకు ఖాతాల çస్టేట్‌మెంట్లను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అభిషేక్‌ బోయినిపల్లి మరికొన్ని కంపెనీల్లో కూడా డైరెక్టర్‌గా ఉన్నారు. 

బెంగళూరు, చెన్నైల్లోనూ పిళ్లై లింకులు..!
మరోవైపు బెంగళూరులో అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్‌లైతో సంబంధాలున్న ఇతర స్పిరిట్‌ కంపెనీల్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. అయితే బెంగళూర్‌ కేంద్రంగా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న పిళ్‌లైకి ఇక్కడ ఉన్న సంబంధాలు, లావాదేవీలపై ఈడీ ఆరా తీసినట్టు తెలిసింది. అలాగే చెన్నైలోనూ ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. అక్కడి వ్యవహారాలతో కూడా పిళ్‌లైకి సంబంధాలుండటం సంచలనం రేపుతోంది. 

సిండికేట్‌లో భాగంగానే..
ఢిల్లీ లిక్కర్‌ దందాలో టెండర్లు దక్కనిపక్షంలో ఇతర కంపెనీలతో సిండికేట్‌ ఏర్పాటు చేసుకోవడానికే పిళ్‌లై ముందస్తుగా హైదరాబాద్‌లో రాబిన్‌ డిస్టలరీస్‌ ఏర్పాటు చేసినట్టు సీబీఐ అనుమానిస్తోంది. బెంగళూరుకు చెందిన ఇండో స్పిరిట్‌ కంపెనీతో సిండకేట్‌కు పిళ్లై ప్రయత్నించినట్టు ఆరోపణలున్నాయి. సిండికేట్‌ కోసమే రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల మేర లంచాలిచ్చినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. 

రాజకీయంగా హీట్‌..!
లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ సోదాలు నిర్వహించడం రాజకీయంగా హీట్‌ పెంచుతోంది. ఈ వ్యవహారంలో రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తిపై బీజేపీ, కాంగ్రెస్‌లు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈడీ తాజాగా చేపట్టిన సోదాలతో రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రమై వేడి రాజుకునే సూచనలు కన్పిస్తున్నాయి.

ఇదీ చదవండి: Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా ఏకకాలంలో 30 చోట్ల ఈడీ మెరుపు దాడులు  

మరిన్ని వార్తలు