60,941 ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు 

19 Sep, 2021 05:04 IST|Sakshi

ముగిసిన తొలిదశ కౌన్సెలింగ్‌ 

ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 5,108 సీట్లు 

ఈ నెల 23 లోగా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద మొదటి దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. తొలి దశలో 61,169 సీట్లు ఎంసెట్‌ అర్హులకు కేటాయించినట్టు సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని స్పష్టం చేశారు. ఆయా కాలేజీల ఫీజుల వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల కోసం మొత్తం 71,216 మంది సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. 69,793 మంది వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేశారు. అయితే ఇంజనీరింగ్‌ విభాగంలో 15 ప్రభుత్వ, రెండు ప్రైవేటు యూనివర్సిటీ కళాశాలలు, 158 ప్రైవేటు కాలేజీలతో కలిపి మొత్తం 175 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 74,071 సీట్లున్నాయి. మొదటి దశ కౌన్సెలింగ్‌ ద్వారా 60,941 సీట్లు (82.27 శాతం) భర్తీ చేశారు. ఫార్మసీలో 115 కాలేజీల్లో 4,199 సీట్లు అందుబాటులో ఉంటే 228 సీట్లను భర్తీ చేశారు. ఈడబ్ల్యూస్‌ కోటా కింద తొలిదశలో 5,108 సీట్లు (ఇంజనీరింగ్, ఫార్మా) కేటాయించారు. 

>
మరిన్ని వార్తలు