ఇంజనీరింగ్‌, ఫార్మాలో ఫీజుల వాత.. 15శాతం వరకు

6 Jan, 2022 01:38 IST|Sakshi

ఇంజనీరింగ్, ఫార్మా ఫీజుల పెంపునకు రంగం సిద్ధం

కాలేజీల మూడేళ్ల ఆదాయ, వ్యయాల నివేదిక కోరిన ఏఎఫ్‌ఆర్‌సీ

ఫిబ్రవరి 28లోగా ప్రతిపాదనలు కోరుతూ నోటిఫికేషన్‌

2019–20 ఆదాయ, వ్యయాలే పరిగణనలోనికి..!

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి (2022–23 విద్యా సంవత్సరం) 15 శాతం మేర వార్షిక ఫీజులు పెరగబోతున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలకు ఇది వర్తిస్తుంది. రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్‌ఏఎఫ్‌ఆర్‌సీ) ఈ మేరకు అనుమతినివ్వనున్నట్టు సమాచారం. ఏఎఫ్‌ఆర్‌సీ ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒక నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. ఫీజుల పెంపు కోరుకునే అన్ని కాలేజీలు వచ్చే నెల 28లోగా తమ ప్రతిపాదనలు పంపాలని కోరింది.

ప్రైవేటు కాలేజీల ఆదాయ వ్యయాలను ప్రతి మూడేళ్లకోసారి ఏఎఫ్‌ఆర్‌సీ సమీక్షిస్తుంది. దీని ఆధారంగా ఫీజుల పెంపుదలకు అనుమతిస్తుంది. రాష్ట్రంలో 2019లో ఈ విధంగా అనుమతినిచ్చారు. దీని కాలపరిమితి 2021–22తో ముగిసింది. దీంతో వచ్చే మూడేళ్ళకు ఫీజుల పెంపును ఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కనీస వార్షిక ఫీజు రూ.35 వేలు ఉంటే, గరిష్టంగా రూ.1.34 లక్షల వరకు ఉంది. ఎక్కువ కాలేజీల్లో వార్షిక ఫీజు రూ.75 వేలకు పైగానే ఉండటం గమనార్హం.

కరోనా కాలం నో కౌంట్‌ 
ఏఎఫ్‌ఆర్‌సీ ఎప్పటిలాగే కాలేజీల నుంచి మూడేళ్ళ వివరాలు కోరింది. అయితే ఇందులో కేవలం 2019–20 కాలానికి సంబంధించిన వ్యయాన్నే పరిగణనలోనికి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 20–21, 21–22 సంవత్సరాల్లో ఎక్కువ కాలం కరోనాతో విద్యా సంస్థలు మూతపడ్డాయి. కాబట్టి లేబొరేటరీలు, లైబ్రరీలు ఇతర ఖర్చులన్నీ ఉండే అవకాశం లేదు.

అయితే కరోనా కాలంలో సరిగా ఫీజులు వసూలు కాలేదనే కాలేజీల వాదనతోనూ కమిటీ ఏకీభవించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆన్‌లైన్‌ విద్యకు మౌలిక సదుపాయాలు సమకూర్చుకున్నామని, దీనికి పెద్ద మొత్తంలో ఖర్చయిందనే వాదనను తెరమీదకు తేవాలని కాలేజీ యాజమాన్యాలు ప్రయత్నించాయి. కానీ తరహా దోపిడీపై ‘సాక్షి’ఇటీవల ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో కమిటీ ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది.

ఫ్యాకల్టీ ముసుగులో అవకతవకలపై దృష్టి
కాలేజీల వార్షిక వ్యయంలో సింహభాగం బోధన, బోధనేతర సిబ్బంది జీతాల ఖర్చే ఎక్కువగా ఉంటుంది. యాజమాన్యాలు దీన్నే ప్రధానంగా ఆడిట్‌ లెక్కల్లో చూపుతాయి. అయితే లెక్కల్లో చూపించే విధంగా ఫ్యాకల్టీ కాలేజీల్లో ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. 2019లో ఒకే అధ్యాపకుడిని రెండు, మూడు కాలేజీలు తమ ఫ్యాకల్టీగా చూపడం గమనార్హం. నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) స్క్రూటినీలోనే ఇది బయటపడింది.

ఈసారి ఇలాంటి అవకతవకలకు తావు లేకుండా జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ఏఎఫ్‌ఆర్‌సీ వర్గాలు తెలిపాయి. కొన్ని కాలేజీలు బోధన సిబ్బందికి సరిగా జీతాలివ్వడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆడిట్‌ రిపోర్టులో ఎవరికి? ఏ ఖాతా ద్వారా చెల్లించారు? అనేది పరిశీలిస్తే కాలేజీల గోల్‌మాల్‌ వెలుగు చూసే వీలుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా 15 శాతం ఫీజుల పెంపు అంశంపై విద్యార్థి సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. 

ఫీజులు పెంచితే ఉద్యమించక తప్పదు
రెండేళ్ళుగా కరోనాతో ప్రజలు అల్లల్లాడి పోతుంటే ఫీజుల పెంచాలనే ఆలోచన ఎంతమాత్రం సహేతుకం కాదు. ప్రైవేటు దోపిడీని అడ్డుకోవాల్సిన నియంత్రణ కమిటీ, పెంపునకు మార్గం సుగమం చేయడం దారుణం. రెండేళ్ళుగా కాలేజీలే లేనప్పుడు ఖర్చు ఎలా ఉంటుంది? ఫీజులు ఎందుకు పెంచాలి? పెంపు నిర్ణయం తీసుకుంటే ఉద్యమించక తప్పదు.
– నాగరాజు (ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి) 

సిబ్బంది జీతాల వివరాలు బయటపెట్టాలి
కరోనా సమయంలో అధ్యాపకులు, ఉద్యోగులు అర్ధాకలితో అలమటిస్తున్నా ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో జీతాలు ఇవ్వలేదు. నిజంగా ఇచ్చి ఉంటే అవి బ్యాంకు ద్వారానే ఇవ్వాలి. కాబట్టి ఆ వివరాలు బయటపెట్టాలి. వాటిని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే కాలేజీల నిర్వహణ ఖర్చుపై ఏఎఫ్‌ఆర్‌సీ ఓ నిర్ణయానికి రావాలి. అంతే తప్ప ప్రైవేటు కాలేజీల తప్పుడు లెక్కలను పరిగణనలోనికి తీసుకోకూడదు.
– అయినేని సంతోష్‌కుమార్‌ (ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు) 

మరిన్ని వార్తలు