డిసెంబర్‌ 1లోగా ఇంజనీరింగ్‌ తరగతులు

22 Oct, 2020 04:12 IST|Sakshi

నవంబర్‌ 30లోగా ప్రవేశాలు పూర్తి

ఏఐసీటీఈ రివైజ్డ్‌ షెడ్యూలు జారీ

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు డిసెంబర్‌ 1లోగా తరగతులను ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పేర్కొంది. ఈ మేరకు రివైజ్డ్‌ షెడ్యూలును ప్రకటించింది. నవంబర్‌ 1 నుంచే తరగతులను ప్రారంభించేలా గతంలో అకడమిక్‌ షెడ్యూలును ప్రకటించినప్పటికీ ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ వంటి జాతీయస్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో అకడమిక్‌ షెడ్యూలును తాజాగా సవరించింది.

వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో నవంబర్‌ 30లోగా ప్రవేశాలను పూర్తి చేయాలని, డిసెంబర్‌ 1లోగా తరగతులను ప్రారంభించాలని వివరించింది. పరిస్థితులను బట్టి ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌ విధానంలో తరగతులను (అవసరమైతే రెండు పద్ధతుల్లో) నిర్వహించాలని సూచించింది. యూజీసీ జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని తన పరిధిలోని విద్యాసంస్థలను ఆదేశించింది. విద్యార్థులకు అవగాహన కోసం నిర్వహించే ఇండక్షన్‌ ప్రోగ్రాంను 3 వారాలకు బదులు మొదట ఒక వారమే నిర్వహించాలని సూచించింది. మిగతా రెండు వారాల ప్రోగ్రాంను తదుపరి సెమిస్టర్లలో నిర్వహించాలని స్పష్టం చేసింది.  

మరిన్ని వార్తలు