అక్టోబర్‌లో బీటెక్‌ ప్రత్యక్ష తరగతులు 

22 Aug, 2021 03:48 IST|Sakshi

రెండు, మూడు, నాలుగో ఏడాది విద్యార్థులకు కుదిరితే సెప్టెంబర్‌లోనే 

అక్టోబర్‌ మొదటి వారంలో మొదటి సంవత్సరం క్లాసులు 

ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి నివేదిక 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కాలేజీలను వీలైనంత త్వరగా తెరిచే వీలుంది. రెండు, మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థుల తరగతులను  సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇది వీలుకాకపోతే అక్టోబర్‌ నుంచైనా ప్రత్యక్ష బోధన చేపట్టే వీలుంది. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ త్వరగా ముగించి, అక్టోబర్‌ మొదటి వారంలో బీటెక్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు క్లాసులు ప్రారంభించే యోచనలో ఉన్నారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సీఎం ఆదేశం కోసం ఎదురు చూస్తున్నామని మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.  

ఏఐసీటీఈ డెడ్‌లైన్‌.. 
అక్టోబర్‌ 15లోగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో పూర్తిస్థాయి ప్రత్యక్ష బోధన చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) రాష్ట్రాలను ఆదేశించింది. సామాజిక దూరం పాటిస్తూ తరగతులు నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రతి సెక్షన్‌లోనూ గరిష్టంగా 60 మంది విద్యార్థులు ఉంటారు. చాలా కాలేజీల్లో బెంచ్‌కు ఇద్దరు చొప్పున కూర్చుంటున్నారు. ఇకపై ఒక్కరినే కూర్చోబెట్టడం సాధ్యమేనా అనే దిశగా పరిశీలన చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇలా చేయాల్సి వస్తే సెక్షన్లు పెంచాల్సి ఉంటుంది. దీన్ని అమలు చేయగల సామర్థ్యం ఎన్ని కాలేజీలకు ఉందనే వివరాలను ప్రభుత్వం ముందుంచారు. 

అక్టోబర్‌ 15లోపే ఫస్టియర్‌ 
ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరంలో అడుగుపెట్టే వారికి అక్టోబర్‌ 15లోగా ప్రత్యక్ష బోధన చేపట్టాలని ఏఐసీటీఈ సూచించింది. ఎంసెట్‌ ఫలితాలను ఈ నెల 25న వెల్లడిస్తారు. 30 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియభహ మొదలుపెడుతున్నారు. సెప్టెంబర్‌ 4 నుంచి 11 మధ్య ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. ఇదే నెల 4 నుంచి 13 తేదీల మధ్య వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్‌ 15న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. జీఈఈ ఫలితాల తర్వాత తదుపరి కౌన్సెలింగ్‌ చేపడతారు. మొత్తమ్మీద సెప్టెంబర్‌ 30 లేదా అక్టోబర్‌ 4 నాటికి సీట్ల కేటాయింపు జరపాలని, అక్టోబర్‌ మొదటి వారంలో కాలేజీల్లో విద్యా బోధన నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు.   

>
మరిన్ని వార్తలు