తెలంగాణలో ఇంజనీరింగ్‌ ఫీజుల మోత!

20 Oct, 2022 07:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గరిష్ట ఫీజు రూ.1.60 లక్షలు.. కనీస ఫీజు రూ. 45వేలకు పెంపు

40కాలేజీల్లో రూ.లక్ష పైనే.. మరో 38 కాలేజీల్లో రూ.75 వేలపైన ఖరారు

వచ్చే మూడేళ్ల పాటు అమలు.. ఎంసీఏ, ఎంబీఏ ఫీజులూ పెంపు

ఉత్తర్వులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో వృత్తి విద్య కోర్సుల ఫీజులు పెరిగాయి. ఇంజనీరింగ్‌తోపాటు ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల ఫీజులను పెంచుతూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన ఫీజులు ప్రస్తుత (2022–23) విద్యా సంవత్సరం నుంచి 2024–25 విద్యా సంవత్సరం వరకూ అమల్లో ఉంటాయని తెలిపారు. ‘రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ)’ ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 2019 నుంచి అమల్లో ఉన్న ఫీజులతో పోలిస్తే.. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సగటున 20 శాతం వరకూ ఫీజులు పెరిగాయి.

పెద్ద కాలేజీల్లో 10 నుంచి 15 శాతం పెంచగా.. రూ.35 వేలుగా ఉన్న కనీస ఫీజును రూ.45 వేలకు పెంచారు. రాష్ట్రంలో గరిష్టంగా మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంజీఐటీ)కి గరిష్టంగా రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. ఇక ఎంసీఏ కోర్సుల వార్షిక ఫీజులను కనిష్టంగా రూ.27 వేల నుంచి గరిష్టంగా రూ.లక్ష వరకు.. ఎంటెక్‌ ఫీజులను కనిష్టంగా రూ.57 వేల నుంచి గరిష్టంగా రూ.1.10 లక్షల వరకు పెంచారు. మొత్తం 153 కాలేజీలకు మాత్రమే ఫీజులు పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మిగతా కాలేజీల్లో కొన్నింటికి అనుబంధ గుర్తింపు రావాల్సి ఉండటంతో ఫీజుల నిర్థారణ చేయలేదని తెలిపారు.

40 కాలేజీల్లో లక్షపైనే..
తాజా ఫీజుల పెంపును పరిశీలిస్తే.. రూ.లక్ష, ఆపైన ఫీజు ఉండే జాబితాలో ఇంతకుముందు 18 కాలేజీలుంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 40కి పెరిగింది. రూ.75వేలపైన వార్షిక ఫీజున్న కాలేజీలు 24 నుంచి 38కి చేరాయి. తొమ్మిది కాలేజీల్లో కనీస ఫీజు రూ.35 వేల నుంచి రూ. 45వేలకు పెరిగింది. మరో 66 కాలేజీల్లో రూ.45 వేల నుంచి రూ.75 వేల మధ్య ఫీజులు ఉండబోతున్నాయి. 

మరిన్ని వార్తలు