తొలిమెట్టు.. తీసికట్టు!

19 Sep, 2022 08:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సర్కారు బడుల విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచే ‘తొలిమెట్టు’ అమలు కాగితాలకే పరిమితమైంది. కరోనా తీవ్రత నేపథ్యంలో వరుసగా రెండేళ్లు స్కూళ్ల మూత, ఆన్‌లైన్‌ బోధనలతో విద్యార్థుల సామర్థ్యాలు బాగా తగ్గాయి. ప్రైమరీ పాఠశాలల విద్యార్థులు బేసిక్స్‌ కూడా మరిచిపోవడంతో వారిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూలై చివరి నుంచి ఆగస్టు మొదటి వారం వరకు  ప్రైమరీ స్కూల్‌ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. సామర్థ్యాల పంపు ప్రక్రియ మాత్రం కనిపించడం లేదు. 

షెడ్యూలు ఇలా.. 
విద్యార్థులకు మౌలిక భాష, గణితంలో సామర్థ్యం పెరిగేలా బోధించడం కోసం తొలిమెట్టులో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు బేస్‌ లైన్‌ టెస్ట్‌లు నిర్వహించి అభ్యసన స్థాయిలను గుర్తించాలి. అనంతరం విద్యార్థుల స్థాయికి తగ్గట్టు బోధనా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఈ షెడ్యూలు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా.. కనీసం ప్రస్తావన కూడా లేకుండా పోయింది. నెలకోసారి పిల్లల ప్రగతిని నమోదు చేసి కాంప్లెక్స్‌ స్థాయిలో ప్రతి నెలా 26న టీచర్లతో, 28న మండలాలవారీగా, 30న జిల్లాలవారీగా సమీక్షలు జరగాలి. ఆచరణలో మాత్రం ఆ జాడ 
కనిపించడం లేదు.

టీచర్ల కొరతతోనే.. 
సర్కారు స్కూళ్లల్లో టీచర్ల కొరత కారణంగానే తొలిమెట్టు సక్రమంగా అమలు కావడం లేదు. కరోనాకు ముందు విద్యా వలంటీర్లతో కొంత సర్దుబాటు జరిగినా...ఆ తర్వాత వలంటీర్లను రెన్యూవల్‌ చేయలేదు. దీంతో బోధన కుంటుపడుతోంది. పలు సబ్జెకుల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం పర్యవేక్షణకు  ప్రధానోపాధ్యాయులు లేక  ఇన్‌చార్జిలతో కొనసాగుతున్నాయి. వాస్తవంగా ఏళ్లుగా టీచర్ల ఖాళీలు భర్తీ లేక బోధనకు ఆటంకం కలుగుతోంది. నాలుగేళ్లుగా బదిలీలు, ఏడేళ్లుగా పదోన్నతులు, 17 ఏళ్లుగా పర్యవేక్షణ అధికారుల నియామకాలు జరగడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తయ్యే దాకా బోధనకు ఆటంకం కలగకుండా వలంటీర్లను నియమించాలని డిమాండ్‌ వ్యక్తమవుతోంది.  

(చదవండి: ఎన్‌ఐఏ విస్తృత తనిఖీలు)

మరిన్ని వార్తలు