డిసెంబర్‌లో ‘ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ 360’ 

25 Aug, 2020 02:59 IST|Sakshi

కోవిడ్‌ నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య సవాళ్లపై అంతర్జాతీయ వర్చువల్‌ సదస్సు

సుమారు 20వేల మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం

వ్యూహాల సమీక్ష, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారి మూలంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించేందుకు హైదరాబాద్‌లో అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ మేరకు సదస్సు నిర్వహించడానికి ‘ది ఇండస్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ (టై)’ హైదరాబాద్‌ శాఖ సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్‌ 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ వర్చువల్‌ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సుమారు 20వేల మంది వ్యాపార, వాణిజ్య వేత్తలు, రెండు వందల మంది పెట్టుబడిదారులు ఇందులో పాల్గొం టారు. వ్యాపార, వాణిజ్య, క్రీడా, తదితర రంగాలకు చెందిన సుమారు 50 మంది వక్తలు ప్రసంగిస్తారు. అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్య దిగ్గజాలు సత్య నాదెళ్ల, రతన్‌టాటా, ఎలాన్‌ మస్క్, సుందర్‌ పిచాయ్, ఆనంద్‌ మహీంద్రా, షెరిల్‌ సాండ్‌బెర్గ్‌ వంటి వారు ఈ సదస్సులో పాల్గొంటారని ‘టై’ వెల్లడించింది.

సరికొత్త అవకాశాలపై చర్చలు..
‘ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ 360’గా పిలిచే ఈ సదస్సులో కోవిడ్‌ కారణంగా వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చిస్తారు. ఎంట్రప్రెన్యూర్స్‌ తమ వ్యూహాలను సమీక్షిం చుకోవడంతో పాటు, తమకు అవసరమైన పెట్టుబడులు సమకూర్చుకునేలా ఈ సదస్సు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఇందులో పలువురు అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్యవేత్తలు తమ ఉత్పత్తులు, సేవలు ప్రదర్శించే అవకాశం ఉంది. కోవిడ్‌ మూలంగా వివిధ రంగాలు దెబ్బతిన్నా, అంతే సమంగా కొత్త అవకాశాలూ ఉన్నాయనే కోణంలో ఈ సదస్సులో భాగస్వామ్యం వహిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా, ప్రపంచ వ్యాప్తంగా 15వేలకు పైగా సభ్యులు, 3వేలకు పైగా చార్టర్‌ సభ్యులతో పాటు 14దేశాల్లో 61 చాప్టర్‌లను ‘టై’ కలిగి ఉంది. డిసెంబర్‌లో జరగనున్న టై సదస్సులో అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా ఖండాల నుంచి 25 చాప్టర్‌లు పాల్గొనే అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు