400 ఏళ్ల చరిత్ర..‌ ముట్టుకుంటే ఊడిపోతోంది

21 Mar, 2021 08:17 IST|Sakshi

చార్మినార్‌కు  అత్యవసర మరమ్మతులు   

బలహీనంగా మారి రాలిపోతున్న డంగుసున్నం పూత

సోమవారం నుంచి లాడ్‌బజార్‌వైపు దిగువ భాగంలో పనులు  

సాక్షి, హైదరాబాద్‌: బాగా పాతబడిపోవటం, వాహన కాలుష్య ప్రభావం.. వెరసి చార్మినార్‌ కట్టడం పైపూత అత్యంత బలహీనంగా మారిపోతోంది. ఇప్పుడు కట్టడంలోని చాలా ప్రాంతాల్లో ముట్టుకుంటే చాలు పొరలుపొరలుగా మట్టి రాలిపోతోంది. ఇటీవలి కాలంలో ఈ సమస్య బాగా పెరిగిపోయింది. దాదాపు ఒక అంగుళం నుంచి రెండు అంగుళాల మేర కట్టడంపైనున్న డంగు సున్నం పూత అత్యంత బలహీనంగా మారినట్టు కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం గుర్తించింది. దీంతో అత్యవసర చర్యలు ప్రారంభించింది. కట్టడంలో ఏయే ప్రాంతాల్లో డంగుసున్నం పొరలు బలహీనంగా మారాయో గుర్తించి అంతమేర దాన్ని తొలగించి సంప్రదాయ డంగుసున్నం మిశ్రమాన్ని మెత్తే పని ప్రారంభించారు. శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో పై పొర తొలగించారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో పనులు ప్రారంభించనున్నట్టు తెలిసింది. సీనియర్‌ కన్సర్వేషన్‌ అసిస్టెంట్‌ భానుప్రకాశ్‌ వర్మ ఆధ్వర్యంలో పనులు నిర్వహించనున్నారు.  

ఆరు నెలలపాటు పనులు.. 
చార్మినార్‌ పరిరక్షణ చర్యలు తరచూ జరిగేవే. అయితే ఒకేసారి కావాల్సినన్ని నిధులు ఇవ్వకపోవడంతో మధ్యమధ్య విరామం ఇస్తూ పనులు చేస్తున్నారు. ఇది కూడా సమస్యలకు కారణమవుతోంది. రెండేళ్లక్రితం మరమ్మతు పనులు నిర్వహించారు. అప్పట్లో రెండు దఫాల్లో రూ.35 లక్షలు రావటంతో వాటితో పనులు చేసి ఆపేశారు. మళ్లీ ఇప్పుడు కేంద్రం కొన్ని నిధులు ఇవ్వటంతో వాటితో అత్యవసరంగా పనులు ప్రారంభించారు. విరామం లేకుండా పనులు జరిగితే దాదాపు ఏడాదిన్నర కాలంలో మొత్తం పనులు పూర్తవుతాయి. రెండేళ్ల క్రితం మొదటి అంతస్తు నుంచి మినార్ల వరకు పరిరక్షణ చర్యలు పూర్తి చేశారు. ఇప్పుడు దిగువ భాగంలో పనులు ప్రారంభిస్తున్నారు. రెండేళ్ల క్రితం పనులు చేసిన చోట కూడా మట్టి రాలిపోతోంది. అప్పట్లో లేపనంలాగా అద్దిన పైపూత పటిష్టంగానే ఉన్నా... దానిలోపలి సున్నం మిశ్రమం బలహీనంగా మారటంతో పై పూత ఊడిపోతోంది.  

ఎందుకీ సమస్య.. 
కులీకుతుబ్‌షా 1591లో దీన్ని నిర్మాణం చేపట్టారు. 430 ఏళ్లు గడుస్తున్నందున స్వతహాగా కట్టడం మట్టి భాగం బలహీనపడింది. అయినప్పటికీ అది లోపలి రాతి నిర్మాణాలు పట్టుకుని నిలిచిఉంటుంది. కానీ.. దశాబ్దాలుగా కట్టడానికి అతి చేరువగా వాహనాలు తిరుగుతుండటంతో కాలుష్యం కాటేస్తోంది. వానాకాలంలో తడితో కలిసి రసాయన చర్య ఏర్పడి క్రమంగా గోడల డంగు సున్నం పొరలు బలహీనపడిపోయాయి. దీంతో పటుత్వం కోల్పోయి మట్టి రాలిపోతోంది. ఇటీవలి కాలంలో సమస్య బాగా పెరిగింది. ఇప్పుడు అలాంటి ప్రాంతాల్లో పై పూతను తొలగించి కొత్త మిశ్రమాన్ని పూసి, ఆయా ప్రాంతాల్లో ఉండాల్సిన నగిషీలను తిరిగి ఏర్పాటు చేయనున్నారు.  సోమవారం నుంచి ఆ పనులు మొదలు కానున్నాయి. తొలుత లాడ్‌బజార్‌ వైపు భాగానికి పనులు చేపట్టనున్నట్టు సమాచారం. 

మరిన్ని వార్తలు