TS: ప్రతి మండలంలో మహిళా వేదిక

18 Dec, 2022 02:02 IST|Sakshi

జాతీయస్థాయి సెమినార్‌లో మంత్రి ఎర్రబెల్లి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి మండలంలో మహిళా వేదికను నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వెల్లడించారు. రైతుల కోసం రైతు వేదికలను నిర్మించినట్టే మండలానికి, వీలైతే కొన్ని గ్రామాలకు కలిపి మహిళా భవనాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారని తెలిపారు. ఏపీమాస్, ఎనేబుల్, నాబార్డ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో మూడు దశాబ్దాలుగా స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ)తో బ్యాంక్‌ లింకేజీ ప్రక్రియ విజయవంతంగా సాగుతున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీఐలో శుక్ర, శనివారాల్లో జాతీయస్థాయి సెమినార్‌ జరిగింది.

ఈ సందర్భంగా శనివారం సాయంత్రం జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన పలు రాష్ట్రాలకు చెందిన 17 మహిళా సంఘాలకు మంత్రి అవార్డులను అందజేశారు. అనంతరంమాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 17,978 మహిళా స్వయం సహాయక సంఘాలు కొనసాగుతున్నాయని, ఇందులోని సభ్యులందరికీ ఉపయోగపడేలా మహిళా భవనాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

స్వయం సహాయక బృందాల్లో స్త్రీనిధి ద్వారా ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.3 లక్షల రుణాలు తీసుకుంటున్నారని చెప్పారు. రుణాలు తీసుకున్న మహిళలు దురదృష్టవశాత్తు చనిపోతే వారి రుణాలను మాఫీ చేయాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు చెందిన కామారెడ్డి మండల మ్యూచువల్‌ ఎయిడెడ్‌ సహకార సమాఖ్యకు మొదటి బహుమతి, దక్షిణ భారతదేశ కేటగిరీలో హనుమకొండ జిల్లా బ్రహ్మదేవరపల్లి మండల మ్యూచువల్‌ ఎయిడెడ్‌ సహకార సమాఖ్యకు రెండో బహుమతి రావడంతో మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్‌ సుల్తానియా పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు