ఎంజీఎంలో మరింత మెరుగైన సేవలు! 

1 Sep, 2020 12:14 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌రావు, పక్కన చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు తదితరులు

సాక్షి, వరంగల్‌: ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై ఎంతో నమ్మకముందని, అందుకే ఎక్కడా నయం కాని వ్యాధులతో బాధపడే అనేక మంది ప్రభుత్వ దవాఖానాలకే వస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిపై నమ్మకం మరింత పెరిగేలా సదుపాయాలు క్పలించడమే కాక, కరోనా బాధితుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఒక్కశాతం కూడా మించని రోగులు మాత్రమే ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. 99శాతానికి మించి ప్రజలు ప్రభుత్వ వైద్యాన్నే ఆశ్రయిస్తున్నారని మంత్రి తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కరోనా పరిస్థితులు, ఎంజీఎంలో వైద్యసేవలు, వరదల తర్వాత వరంగల్‌ నగరంలో నాలాలపై కబ్జాల తొలగింపుపై హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయం ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు, సీపీ ప్రమోద్‌ కుమార్‌ తదితరులతో మంత్రి దయాకర్‌రావు సోమవారం సమీక్షించారు. ఆ తర్వాత మీడియాకు ఆయన వివరాలు వెల్లడించారు.

నెల రోజుల్లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి
వరంగల్‌ ఎంజీఎంలో సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఎంజీఎంలో ప్రస్తుతం 340 పడకలు అందుబాటులో ఉండగా, అందులో 134 పడకలు ఖాళీగా ఉన్నాయని, 60 వెంటిలేటర్లకు గాను నలుగురు మాత్రమే కరోనా బాధితులు ఉన్నారని చెప్పారు. ఇక 88 ఆక్సీజన్‌ బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం 129 మంది కరోనా బాధితులు, 77 మంది ‘సారీ’ పేషంట్లు కలిపి మొత్తం 206 మంది ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని మంత్రి వివరించారు. త్వరలోనే మరో 100 వెంటిలేటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. కాగా, కేఎంసీ ఆవరణలోని పీఎంఎస్‌ఎస్‌వై ఆస్పత్రిని సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిదిద్ది నెల రోజుల్లోగా అందుబాటులోకి తీసుకురానున్నామని వెల్లడించారు. కాగా, రోగులకు నమ్మకం కలిగేంచేలా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని, ప్రజలు కూడా ఎవరో చెప్పే మాటలు విశ్వసించకుండా ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రజాభీష్టం మేరకే నాలాల కూల్చివేత
వరంగల్‌ నగరంలో వరద పరిస్థితులు అదుపులోకి వచ్చాక ప్రజాభీష్టం మేరకే నాలాల కబ్జాల కూల్చివేత ప్రారంభమైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. 27కి.మీ. పొడవున విస్తరించిన నగర ప్రధాన నాలాలపై కబ్జాలను తొలగించేందుకు నాలుగు బృందాలు పని చేస్తుండగా, ఇప్పటి వరకు 23 కబ్జాలను తొలగించామని వివరించారు. మిగతా వాటిని యుద్ధ ప్రాతిపదికన 10 రోజుల్లోగా కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. వరదల సమయంలో తక్షణ సాయంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ మంజూరు చేసిన రూ.25కోట్లతో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే, వర్షంతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు కార్పొరేషన్‌ నిధులను వినియోగించుకోవాలని చెప్పారు. ఈనెల 4వ తేదీన వరంగల్‌ నగరంలో పర్యటించి తిరిగి సమీక్ష చేస్తామని తెలిపారు.

విమానాశ్రయం పునరుద్ధరణ
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న వరంగల్‌ నగరంలో విమానాశ్రయ పునరుద్ధరణే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆధికారుల సూచనల మేరకు 1,140 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన ఎయిర్‌పోర్ట్‌ను ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు కావాల్సిన 430 ఏకరాల భూమిని రైతుల నుంచి సేకరిస్తామని తెలిపారు. ఖిలా వరంగల్‌ మండలం మామునూరులోని పురాతన కాలం నాటి విమానాశ్రయాన్ని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆధికారులు, ప్రభుత్వ చీఫ్‌విఫ్‌ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి మంత్రి సందర్శించారు.  ఈ సందర్భంగా మంత్రి రన్‌వే, మాస్టర్‌ ప్లాన్‌ను పరిశీలించారు. ఇప్పటి వరకు ఏయే గ్రామాల్లో ఎంత భూమిని సర్వే చేశారని ఆరా తీశారు.

ఆనంతరం మంత్రి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం రాకముందే 1930లో 706 ఎకరాల విస్థీర్ణంలో నిజాం నవాబ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.ఈ విమానాశ్రయాన్ని పునఃప్రారంభించేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా రన్‌వే పెంపునకు భూసేకరణ చేయాల్సి ఉందని, ప్రధానంగా నక్కలపెల్లి, గాడిపెల్లి గ్రామ శివారుల్లో రైతుల నుంచి 430 ఎకరాల భూమి సేకరించనున్నట్లు తెలిపారు. భూములు కోల్పోతున్న రైతులకు మరోచోట భూమి లేదా నగదు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి వెల్లడించారు. కాగా, రన్‌వే విస్తరణకు అడ్డుగా ఉన్న వరంగల్‌ – నెక్కొండ ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్డును మార్చనున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు