నీకు కరోనా రాను అంటూ శాపనార్థాలు

25 Sep, 2020 06:51 IST|Sakshi

ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజీ డీన్‌కు మెయిల్స్‌ 

సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసు నమోదు 

సాక్షి, సిటీబ్యూరో : కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజీ డీన్‌ శ్రీనివాస్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. నకిలీ ఈ–మెయిల్‌ ఐడీలు సృష్టించిన నేరగాళ్లు ఆయనకు బెదిరింపులు, శాపనార్థాలతో కూడిన మెయిల్స్‌ పంపుతున్నారు. కొన్నింటిలో ‘నీకు కరోన రాను’తో పాటు మరికొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో డీన్‌ తరఫున ఆ కళాశాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బబ్డే గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు ప్రారంభించారు.

హైదరబాద్‌ : యూట్యూబ్‌ చానల్‌లో తాను చేసిన కామెంట్ల ఆధారంగా తనపై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు పోస్టు చేస్తున్న వారిపై ఓ మహిళా న్యాయవాది సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించడంతో మరో కేసు నమోదైంది. నగరానికి చెందిన ఓ వ్యక్తికి రాయల్‌ సుందర్‌ ఫైనాన్స్‌ కంపెనీ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేశారు. ఆయన వినియోగిస్తున్న ఓల్వో కారుకు రూ. 20 వేల రాయితీతో బీమా చేస్తామని చెప్పారు. ఇలా ఆ యజమానిని నమ్మించి ఆయన నుంచి రూ. 98 వేలు కాజేశారు. ఛత్రినాక ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు ఆయన స్థలంలో సెల్‌ టవర్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ పేరుతో ఆరు నెలల కాలంలో రూ. 1.09 లక్షలు కాజేసి మోసం చేశారు. మరో ఉదంతంలో బేగంపేట ప్రాంతానికి చెందిన బాధితుడికి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులంటూ ఎర వేశారు. అతడి నుంచి రూ. 3 లక్షలు తీసుకుని మోసం చేశారు. ఈ ఉదంతాలపై వేర్వేరు కేసులు నమోదయ్యాయి.   

మరిన్ని వార్తలు