అన్నదాతకు అందుబాటులో ‘న్యాయం’ 

18 Mar, 2023 01:07 IST|Sakshi

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ఏర్పాటు 

సాక్షి, హైదరాబాద్‌ /జనగామ: కార్మికులు, మహిళలు, బాలలు, ఖైదీలు.. ఇలా సమాజంలోని పలు వర్గాలకు న్యాయ సహాయం చేసే కేంద్రాలు దేశంలో చాలా ఏర్పాటయ్యాయి. కానీ తొలిసారిగా రైతులకు న్యాయ సహాయం అందించేందుకు కూడా ఓ కేంద్రం ఏర్పాటు కానుంది. బమ్మెర పోతన హలం పట్టిన నేల దేశ చరిత్రలో ఈ నూతన అధ్యాయానికి వేదికవుతోంది. పోతానామాత్యుడి స్వగ్రామమైన తెలంగాణలోని జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ‘అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌’మొదలవుతోంది.

నల్సార్‌ విశ్వవిద్యాలయం, తెలంగాణ లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ, లీగల్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ ఫార్మర్స్‌ సొసైటీ (లీఫ్స్‌) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఈ క్లినిక్‌ ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణ్యన్‌ ఈ రైతు న్యాయ సేవా కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ పి.నవీన్‌రావు, నల్సార్‌ విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీకృష్ణదేవరావులు పాల్గొననున్నారు.

ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోన్న ఈ కేంద్రం ద్వారా రైతులకు మెరుగైన సేవలందించగలిగితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆలోచన మేరకు దేశ వ్యాప్తంగా ఈ అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లు ఏర్పాటవుతాయని న్యాయ, భూచట్టాల నిపుణులు చెపుతున్నారు.  

అన్ని అంశాల్లో రైతుకు సహకారం 
దుక్కి దున్నేనాటి నుంచి తన పంటను మార్కెట్‌లో అమ్ముకునే వరకు రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించే విషయంలో అవసరమైన న్యాయ సాయం అందించడమే ధ్యేయంగా బమ్మెర గ్రామంలో ఈ ‘అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌’ఏర్పాటవుతోంది. భూ సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వల్ల నష్టం వాటిల్లిన సమయంలో, మార్కెట్‌లో మోసాలు చోటు చేసుకుంటే, పంటల బీమా అమలు కానప్పుడు.. ఇలా ప్రతి సందర్భంలోనూ రైతులకు అవసరమైన న్యాయ సాయాన్ని ఈ కేంద్రం ద్వారా అందించనున్నారు.

న్యాయ సేవలను అందించడంతో పాటు రైతు, భూ చట్టాలపై అవగాహన కల్పి చడం, రైతులను చైతన్యపర్చడం లాంటి కార్యక్రమాలను కూడా ఈ కేంద్రాల ద్వారా నిర్వహించనున్నారు. గ్రామంలోని రైతులకు వ్యవసాయ సలహాలు, న్యాయ సాయం ఉచితంగా అందించనున్నారు. ఇందుకోసం పారా లీగల్‌ కార్యకర్త అందుబాటులో ఉంటారు. రైతుల సమస్యలను నమోదు చేసుకునే ఈ కార్యకర్త సదరు వివరాలను నల్సార్, లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ, లీఫ్స్‌ సంస్థలకు పంపనున్నారు. నల్సార్‌ విద్యార్థులు వాటిని పరిశీలించి సహాయాన్ని అందిస్తారు.

రాష్ట్రంలోని 25 న్యాయ కళాశాలలకు చెందిన విద్యార్థులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసే ప్రయత్నం జరుగుతోంది. దీంతో పాటు రైతులకు చట్టాలపై అవగాహన కల్పి చేందుకు గాను క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. గత 17–18 ఏళ్లుగా భూ సమస్యలపై పనిచేస్తోన్న లీఫ్స్‌ సంస్థ మరికొంత వ్యవసాయ చట్టాల అమలుపై గ్రామీణ స్థాయిలో పనిచేయనుంది.  

రైతులకు న్యాయ సేవల దిశగా మొదటి ప్రయత్నం 
రైతులకు చట్టాలతో అవసరం పెరిగింది. కానీ వారి అవసరాలు తీర్చే స్థాయిలో సౌకర్యాలు పెరగలేదు. న్యాయ సేవలూ అందుబాటులో లేవు. అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ మొదటి ప్రయత్నం. ఇది విజయవంతం అయితే బమ్మెరే కాదు దేశమంతటా ఇలాంటి సేవలు అందించే బ్లూప్రింట్‌ తయారవుతుంది.  – లీఫ్స్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు,  భూచట్టాల నిపుణుడు సునీల్‌కుమార్‌ 

మరిన్ని వార్తలు