ఇంటర్నేషనల్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్సిటీ సాధ్యమే 

10 May, 2022 03:56 IST|Sakshi

వర్సిటీ ఏర్పాటు చేసి, నిర్వహించదగ్గ సత్తా న్యాక్‌కు ఉంది  

ఐదు స్పెషల్‌ కోర్సులతో ప్రారంభించాలని సూచన 

తొలుత ఎంటెక్‌.. రెండు, మూడేళ్ల తర్వాత బీటెక్, రీసెర్చ్‌ వింగ్‌లు ప్రారంభం 

ప్రభుత్వానికి కమిటీ సిఫారసులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్నేషనల్‌ కన్‌స్ట్రక్షన్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం నియమించిన కమిటీ పలు సిఫారసులు చేసింది. ప్రస్తుతం మాదాపూర్‌లో ఉన్న నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌)ను విశ్వవిద్యాలయం స్థాయికి పెంచేందుకు వీలుగా సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం ఇటీవల ఓ కమిటీని నియమించింది. రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో న్యాక్‌ డైరెక్టర్‌ జనరల్‌ సభ్యకార్యదర్శిగా, క్రెడాయ్‌ నుంచి ముగ్గురు, బిల్డర్స్‌ అసోసియేషన్‌ నుంచి ఇద్దరు ప్రతినిధులు, సీఐఐ నుంచి ఒకరు చొప్పున సభ్యులుగా ఉన్న కమిటీ లోతుగా పరిశీలించి తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

యూనివర్సిటీ స్థాయికి ఎదిగే అన్ని అర్హతలు, సామర్థ్యాలు న్యాక్‌కు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే వర్సిటీని స్థాపించేందుకు ఏర్పాట్లు ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వం అనుమతించిన తర్వాత వర్సిటీ ఏర్పాటుకు డీపీఆర్‌ సిద్ధం చేయనున్నారు.   విశ్వసనీయ సమాచారం ప్రకారం నివేదికలో పొందుపరిచిన అంశాల్లో కొన్ని ఇలా ఉన్నాయి.  

► దీన్ని గ్లోబల్‌ కన్‌స్ట్రక్షన్‌ యూనివర్సిటీ లేదా ఇంటర్నేషనల్‌ కన్‌స్ట్రక్షన్‌ యూనివర్సిటీగా పేర్కొనాలి. విదేశాల నుంచి కూడా సివిల్‌ ఇంజనీర్లు ఇం దులో చేరే స్థాయికి అభివృద్ధి చెందే అవకాశం ఉంది.  
► ఇందులో స్కూల్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌ కన్‌స్ట్రక్షన్, స్కూల్‌ ఆఫ్‌ సస్టెయినబుల్‌ కన్‌స్ట్రక్షన్‌ ఫర్‌ అర్బన్‌ ప్లానింగ్, డిజిటల్‌ కన్‌స్ట్రక్షన్‌ స్కూల్, కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌ ఫర్‌ రియల్‌ ఎస్టేట్‌ ఇండస్ట్రీ, స్కూల్‌ ఆఫ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్ఛర్‌ ఇంజనీరింగ్‌.. ఇలా ఐదు రకాల విభాగాల కింద స్పెషల్‌ కోర్సులు ఏర్పాటు చేయాలి.  
► సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో 40 ఏళ్ల క్రితం నాటి బోధనే ఇప్పుడూ సాగుతుండటంతో అందులో పురోగతి లేకుండా పోయింది. దాన్ని ఈ యూనివర్సిటీతో భర్తీ చేసి యూరప్, అమె రికా, సింగపూర్‌ లాంటి దేశాల నిర్మాణ రం గంలో వస్తున్న ఆధునికతను ఈ యూనివర్సిటీ కూడా స్థానికంగా అందిస్తుంది.  
► యూనివర్సిటీని ఎంటెక్‌తో ప్రారంభించాలి. బీటెక్‌ విద్యార్థులకు పీజీ కోర్సులు అందిస్తూ రెండు, మూడేళ్లలో బీటెక్, ఆ తర్వాత రీసెర్చ్‌ విభాగాలు ప్రారంభించాలి. 

మరిన్ని వార్తలు