భారీగా పెరగనున్న కాళేశ్వరం అంచనా వ్యయం 

3 Sep, 2021 02:52 IST|Sakshi

కాళేశ్వరం మొత్తం వ్యయం  దాదాపు రూ. 1.11 లక్షల కోట్లు 

మేడిగడ్డ నుంచి అదనంగా మరో టీఎంసీ ఎత్తిపోత వ్యయం రూ.30,435.97 కోట్లు 

గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీకి ఇచ్చిన డీపీఆర్‌లో తెలిపిన రాష్ట్రం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు కాళేశ్వరం అంచనా వ్యయం భారీగా పెరగనుంది. రీడిజైనింగ్‌లో భాగంగా మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని తీసుకునే ప్రతిపాదనకు అదనంగా మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా పనులు చేపట్టిన నేపథ్యంలో దీని వ్యయం లక్ష కోట్లను దాటనుంది. బుధవారం జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో, గురువారం ఢిల్లీలో కేంద్ర జల సంఘానికి సమర్పించిన ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌)లో అదనపు టీఎంసీ వ్యయాన్ని రూ.30,435.97 కోట్లుగా ప్రభుత్వం చూపింది. గతంలో రెండు టీఎంసీలు తీసుకునేలా సమర్పించిన మొదటి డీపీఆర్‌లో పేర్కొన్న ప్రాజెక్టు వ్యయాన్ని కలిపితే మొత్తం వ్యయం  దాదాపు రూ.1.11 లక్షల కోట్లకు చేరుతోంది.  

మార్పుల కొద్దీ పెరిగిన వ్యయం 
ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల పథకాన్ని రీ డిజైన్‌ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడానికి ముందు 2006–07లో ప్రాజెక్టు వాస్తవ అంచనా వ్యయం రూ.17,875 కోట్లుగా ఉంది. అనంతరం ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ అంచనా వ్యయాన్ని రూ.38,500 కోట్లకు పెంచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రాజెక్టును పూర్తిగా రీ డిజైన్‌ చేసి 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు, మరో 18.82 లక్షల ఎకరాలను స్థిరీకరించేలా 18 రిజర్వాయర్ల సామరŠాధ్యన్ని 14 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెంచారు. దీనికి అనుగుణంగా అంచనా వ్యయం రూ.80,190 కోట్లకు చేరినట్లు కేంద్రానికి సమర్పించిన తొలి డీపీఆర్‌లో సాగునీటి శాఖ అధికారులు పేర్కొన్నారు.

అయితే 2015–16 స్టాండర్డ్‌ షెడ్యూల్‌ రేట్లతో తయారు చేసిన ఆ అంచనాలను ఇటీవల సవరించారు. పెరిగిన స్టీలు, సిమెంట్, ఇంధన ధరలతో పాటు జీఎస్టీలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణ వ్యయాన్ని రూ.88,557.44 కోట్లకు పెంచారు. అయితే ఇప్పటివరకు మొదటి డీపీఆర్‌నే పరిగణనలోకి తీసుకుంటున్నారు. తాజాగా రోజుకు 2 టీఎంసీల నీటిని తీసుకునే సామరŠాధ్యన్ని 3 టీఎంసీలకు పెంచేలా పనులు చేపట్టారు. ఈ అదనపు టీఎంసీకి రూ.30,435.97 కోట్ల వ్యయం అవుతోంది.  

ఒక్కో లింకులో ఇలా... 
    లింక్‌–1లో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు పనులకు రూ.4,227 కోట్లు, లింక్‌–2లో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు రూ.11,806 కోట్లు, లింక్‌–4లో మిడ్‌మానేరు నుంచి అనంతగిరి వరకు రూ.4,412కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్‌ వరకు రూ.10,260 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొదటి డీపీఆర్‌లో పేర్కొన్న వ్యయం, ప్రస్తుతం సమర్పించిన డీపీఆర్‌ వ్యయాలు కలిపితే మొత్తం వ్యయం రూ.1,10,625.97 కోట్లకు చేరుతోంది.  

ఇప్పటివరకు రూ.65 వేల కోట్ల ఖర్చు 
    ప్రాజెక్టు మొత్తం వ్యయంలో ఇప్పటివరకు సుమారు రూ.65 వేల కోట్ల మేర ఖర్చు జరిగింది. ఇందులో కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న రుణాల ద్వారానే రూ.45 వేల కోట్ల మేర ఖర్చు జరిగింది. 50 టీఎంసీల మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ కింద 14 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండటం, దీనికి అదనంగా తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటి లభ్యత పెంచేందుకే అదనపు టీఎంసీ పనులు చేపట్టామని డీపీఆర్‌లో పేర్కొన్నారు. మొదటి డీపీఆర్‌లో పేర్కొన్న మేరకు మేడిగడ్డ నుంచి మళ్లించుకునే 195 టీఎంసీలు, ఎల్లంపల్లి వద్ద లభ్యతగా ఉండే 20 టీఎంసీలు, భూగర్భ జలాల ద్వారా లభ్యతగా ఉండే మరో 25 టీఎంసీలు కలిపి మొత్తం 240 టీఎంసీల్లోనే అదనపు టీఎంసీ నీటి వినియోగం ఉంటుందని, అదనపు నీటి వినియోగం చేయబోమని వెల్లడించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు