మాజీ మంత్రి ఈటలకు తీవ్ర అస్వస్థత

31 Jul, 2021 07:15 IST|Sakshi
ఈటల రాజేందర్‌ను పరీక్షిస్తున్న వైద్యులు

ఆక్సిజన్‌ లెవెల్, బీపీ తగ్గడంతోపాటు తీవ్ర జ్వరం 

హుజూరాబాద్‌కు తరలింపు

ప్రజాదీవెన యాత్రకు బ్రేక్‌ 

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రజాదీవెన పాదయాత్రకు బ్రేక్‌ పడింది. జ్వరంతో పాటు ఆక్సిజన్‌ స్థాయి, బీపీ తగ్గడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యా రు. ప్రత్యేక వైద్యుల పరీక్షల తర్వాత హుజూరాబాద్‌లోని కార్యాలయానికి తరలించారు. ఈటల కోలుకునే వరకు యాత్రకు విరామం ప్రకటిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రకటించారు. ప్రజాదీవెన యాత్రలో భాగంగా వీణవంక మండ లం పోతిరెడ్డిపల్లికి శుక్రవారం చేరుకున్నారు.

అక్కడి నుంచి కొండపాక చేరకుని సభలో మాట్లాడిన అనంతరం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. అక్కడే ఉన్న ప్రత్యేక బస్సులో వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ 90/60, షుగర్‌ 265 ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆక్సిజన్‌ స్థాయి లు 94లోపు ఉండటంతో ప్రాథమిక వైద్యం అందించారు. ర్యాపిడ్‌ టెస్టు చేయగా కరోనా నెగటివ్‌ వచ్చింది. మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించగా, జ్వరం తగ్గింది. ముందుగా హైదరాబాద్‌ నిమ్స్‌కు ఈటలను తరలిస్తారని ప్రకటించగా, అందుకు ఆయన ఒప్పుకోలేదని తెలిసింది. దీంతో రాత్రి 7.30 గంటలకు హుజూరాబాద్‌లోని తన కార్యాలయానికి తరలించారు. ఈ నెల 19న కమలాపూర్‌ మండలంలో యాత్ర ప్రారంభించగా, 222 కిలోమీటర్లు యాత్ర కొనసాగింది. 

హిమ్మత్‌నగర్‌ వరకు కొనసాగించిన జమున.. 
కొండపాకలో నిలిచిన పాదయాత్రను ఈటల సతీమణి జమునారెడ్డి హిమ్మత్‌నగర్‌ వరకు కొనసాగించారు. ప్రజలు ఈటల కోసం ఎదురు చూస్తున్నారనే ఉద్దేశంతో ఆమె యాత్రను చేపట్టారు. కాగా, అస్వస్థతకు గురైన ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫోన్లో పరామర్శించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు