కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

4 Feb, 2021 17:38 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ కన్నా ఈటల రాజేందర్‌ను చేస్తే బాగుంటుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ‘కేటీఆర్ సమర్ధుడే కావొచ్చు.. కానీ కేటీఆర్‌పై విమర్శలు వస్తాయి. అదే ఈటలపై అయితే రావు.. అతడు సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తి’’ అని పేర్కొన్నారు. ఈటలకు సీఎం అవకాశం ఇస్తే మంచిదన్నారు. మంత్రి ఈటలపై ప్రశంసలు కురిపించారు. పసుపు బోర్డ్ ఏర్పాటుకు.. పసుపు రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గురువారం మాజీమంత్రి జీవన్‌రెడ్డి లేఖ రాశారు.

క్వింటాల్ పసుపు అమ్మితే తులం బంగారం వచ్చేదని.. ఇప్పుడు తులం బంగారం రూ.50 వేలకు పెరిగిందని.. పసుపు రూ.6 వేలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు బోర్డ్ ఏర్పాటు చేస్తే రైతుకు మేలు జరిగేదని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు 100 రోజుల్లో ఏర్పాటు చేయకుంటే రాజీనామా చేస్తానని బాండ్‌ పేపర్‌ రాసి ఇచ్చిన ఎంపీ అరవింద్ ఇప్పుడు స్పందించడేంటని ప్రశ్నించారు. మార్క్ ఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు చేయొచ్చని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పసుపు రూ.7 వేలకు క్వింటాలు కొనేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. కేంద్రం.. రాష్ట్రం ఒకరిపై ఒకరు నెపం మోపుతున్నారని మండిపడ్డారు. రైతుల పక్షాన మాట్లాడుతున్న ఏకైక మంత్రి ఈటల అని.. రైతుల ఆందోళనకు మద్దతు ఇవ్వడంపై జీవన్‌ రెడ్డి అభినందించారు.

మరిన్ని వార్తలు