-

‘ఈటల’ అనే నేను ప్రజల పక్షాన ఉంటా..

3 Feb, 2021 02:10 IST|Sakshi

నాకు కేసీఆర్‌పై అజమాయిషీ ఉంటుంది.. మంత్రి ఉద్వేగ ప్రసంగం

సాక్షి, ఇల్లందకుంట (హుజురాబాద్‌): ‘పార్టీలు ఉండక పోవచ్చు, జెండాలూ ఉండకపోవచ్చు.. ప్రజల పక్షాన ఎప్పుడూ ఈటల రాజేందర్‌ అనే నేను ఉంటాను. ఆరు సార్లు మీ బిడ్డగా ఆదరించి గెలిపించారు. మీ గౌరవాన్ని పెంచే దిశగా అడు గులు వేస్తాను..’ అంటూ మంత్రి ఈటల రాజేందర్‌ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. కరీంనగర్‌ జిల్లా వావిలాల గ్రామంలో మంగళవారం రైతు వేదికల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లా డారు.

‘నాకు, కేసీఆర్‌కు 20 ఏళ్ల అనుబంధం ఉంది. ఇన్నేళ్ల సంబంధంలో నాకు కేసీఆర్‌పై అజమాయిషీ ఉంటుంది. రైతులు ఏమనుకుంటున్నారో చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆరేళ్ల కాలంలో కేసీఆర్‌ అనేక సార్లు మీటింగ్‌లు పెట్టింది వ్యవసాయం, నీళ్ల మీద మాత్రమే. తెలంగాణ జయించింది విద్యుత్‌ కోతలను మాత్రమేనని అందరు గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్‌ మనస్తత్వం నాకు తెలుసు. వ్యవసాయ రంగంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉండాలనేది ఆయన కోరిక. ఇవాళ కేసీఆర్‌ ఉన్నా లేకపోయినా.. నేను మంత్రిగా ఉన్నా లేకపోయినా రైతులకు అండగా ఉంటాం’ అని అన్నారు. 

దేశానికి అన్నం పెట్టే సత్తా మనకుంది..
దేశం మొత్తానికి అన్నం పెట్టే సత్తా తెలంగాణ రాష్ట్రానికి ఉందని, రాష్ట్రాలు అన్నీ నేడు తెలంగాణ వైపు చూస్తున్నాయని మంత్రి ఈటల అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపైనే ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉందని, రైతులు సేంద్రియ ఎరువులపై దృష్టి సారించి పెట్టుబడి తగ్గించుకోవాలని సూచించారు.  దేశానికి వెన్నెముకగా ఉన్న రైతులకు ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని తెలిపారు. ఎఫ్‌సీఐకి కోటీ 5 వేల టన్నుల ధాన్యం అన్ని రాష్ట్రాల నుంచి రాగా, తెలంగాణ నుంచి 62 లక్షల టన్నుల ధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు