నిలకడగా ఈటల ఆరోగ్యం

1 Aug, 2021 01:48 IST|Sakshi
అపోలో ఆస్పత్రిలో ఈటల రాజేందర్‌ను పరామర్శిస్తున్న బండి సంజయ్‌

అపోలోలో రాజేందర్‌కు చికిత్స 

బండి సంజయ్‌ పరామర్శ

సాక్షి, హైదరాబాద్‌/ హుజూరాబాద్‌/బంజారాహిల్స్‌: పాదయాత్ర సందర్భంగా తీవ్ర అస్వస్థతకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మెరుగైన చికిత్స కోసం శనివారం హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలో ఆయన ప్రజాదీవెన పాదయాత్ర చేస్తున్న క్రమంలో జ్వరం రావడంతోపాటు ఆక్సిజన్, బీపీ లెవల్స్‌తగ్గి తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఈటలను శనివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈటల రాజేందర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజుల్లో ఆయన కోలుకుంటారని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. ఈటలకు కోవిడ్‌ పరీక్ష నిర్వహించగా నెగెటివ్‌ వచ్చిందని, స్వల్పంగా జలుబు, మోకాళ్ల నొప్పుల తో బాధపడుతున్నారని ఆస్పత్రివర్గాలు తెలిపాయి.  

ఓట్లు కొనుక్కోకూడదు: బండి సంజయ్‌ 
హుజూరాబాద్‌లో గెలిచేందుకు ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతున్నదని, వేల కోట్లు ఖర్చు చేస్తూ అబద్ధాలతో గెలిచే ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దుయ్యబట్టారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈటలను శనివారం ఆయన పార్టీ నేతలు వివేక్, డీకే అరుణ తో కలసి పరామర్శించారు. ఈటల తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈటల ప్రజాస్వామ్య పద్ధతిలో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ రాకముందే దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డీకే అరుణ డిమాండ్‌ చేశారు. ఈటలకు ఉన్న బలం ప్రజలేనని, ఫామ్‌హౌస్‌ రాజకీయాలు ఆయనకు చేతకావని రాజేందర్‌ను పరామర్శించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. జితేందర్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు ఈటలను పరామర్శించారు.  

మరిన్ని వార్తలు